Skip to main content

భూసంస్కరణలు - రాజకీయ అంశాలు

వ్యవసాయం, సంబంధిత రంగాల్లో విప్లవాత్మక మార్పులు భూ సంస్కరణల ద్వారానే సాధ్యమవుతాయని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికి అనుగుణంగా 1919 నుంచి అనేక తీర్మానాలు చేసింది. అందువల్ల స్వాతంత్య్రం వచ్చాక అధికారంలోకి రాగానే భూ సంస్కరణలు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చింది. ఆ రంగ అభివృద్ధికి సహాయపడింది.
ఎం.ఎస్. భరుచా కమిటీ
హైదరాబాద్ స్టేట్‌లో కౌలు రైతుల, వ్యవసాయ రంగ పరిస్థితులను తెలుసుకోవడానికి రెవెన్యూ శాఖ 1347 ఫసలీ(1937)లో ఎం.ఎస్.భరుచా అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కౌలుదారుల స్థితిగతులను పరిశీలించి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని సూచించింది. లేని పక్షంలో వ్యవసాయ రంగానికి, దేశానికి ఇబ్బందికరమని హెచ్చరించింది. అవసరమైన మార్పులను సూచిస్తూ కౌలుదారీ చట్టం నమూనాను సూచించింది. ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా 1944లో ‘హైదరాబాద్ ఆసామీ షక్మి చట్టం’ అమల్లోకి వచ్చింది.

ఆసామీ షక్మి చట్టంలోని ముఖ్యాంశాలు:
ఈ చట్టం ప్రకారం.. వరుసగా ఆరేళ్లపాటు భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేసినవారు ఆసామీ షక్మి (రక్షిత కౌలుదార్లు) అవుతారు. చట్ట వ్యతిరేక లెవీ పద్ధతి, సెస్‌లు, పన్నులు, వెట్టి చాకిరిని ఈ చట్టం ద్వారా నిషేధించారు. ఈ చట్టం ద్వారా తీవ్ర దుష్ఫలితాలు తలెత్తాయి. భరుచా కమిటీ (1939) పరిశీలన ప్రారంభించిన కాలం నుంచే భూస్వాములు కౌలుదార్లను వెళ్లగొట్టారు. తమకున్న అధికార బలంతో అధిక కౌలురేట్లను పొందగలిగారు.
ఓ విధంగా ఈ చట్టం నిరుపయోగమైందని చెప్పొచ్చు. 1901-21 మధ్యకాలంలో కౌలుదార్ల సంఖ్య 40 వేల నుంచి 7.62 లక్షలకు పెరగ్గా.. 1931లో వీరి సంఖ్య 4.41 లక్షలకు తగ్గింది. చట్టపరమైన హక్కులను పొందాలనుకున్న జాగీర్దారులు, పెద్ద భూస్వాముల ఆర్థిక, సాంఘిక బలం వల్ల ఈ చట్టం అమల్లోకి రాలేకపోయింది.

కౌలు చెల్లింపులు - కౌలు రేట్లు
హైదరాబాద్ ప్రాంతంలో కౌలు చెల్లింపుల విధానం మూడు రకాలుగా ఉండేది.
  1. బెతాయి లేదా పంటలో భాగం (క్రాప్ షేరింగ్): పంటలో కొంత భాగం ధాన్యాన్ని కౌలుగా చెల్లించేవారు. ఇది పంటలో 20 శాతం నుంచి 40 శాతం వరకు ఉండేది.
  2. గల్లామక్త్యా: ఉత్పత్తితో సంబంధం లేకుండా, పండించిన పంటలో స్థిరమైన భాగం చెల్లించే పద్ధతి లేదా ఉత్పత్తితో సంబంధం లేకుండా ఒక ఎకరానికి కనీస మొత్తంగా ధాన్యరూపంలో చెల్లించే స్థిరమైన కౌలు. కొన్ని సందర్భాల్లో ఈ కౌలు పరిమాణం 2/3 వంతు ఉండేది.
  3. ద్రవ్య రూప కౌలు/ నగదు రూప కౌలు: ఒక ఎకరానికి నగదు రూపంలో చెల్లించే స్థిరమైన కౌలు. ఈ కౌలు రేట్లు నికర ఉత్పత్తిలో 2/3 వంతు కంటే ఎక్కువగా ఉండేవని, నగదు రూప కౌలు భూమి అసెన్‌మెంట్ కంటే 5 నుంచి 12 రెట్లు అధికంగా ఉండేదని భరూచా కమిటీ నివేదిక తెలిపింది. ఇదిగాక భూమిని కౌలుకు తీసుకునే ముందు రెన్యువల్ కోసం అనేక నజరానాలు చెల్లించాల్సి వచ్చేది.
భూ యాజమాన్యకేంద్రీకరణ
 స్వాతంత్య్రానికి పూర్వం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో భూకేంద్రీకరణ చాలా అధికంగా ఉండేది. జమీందారీ, జాగీర్దారీ, ఇనాందారీ విధానాలే కాకుండా వడ్డీ వ్యాపారం వల్ల  భూ యాజమాన్యం వ్యవసాయదారుల నుంచి వ్యవసాయం చేయని, చేయలేని వర్గాల చేతుల్లోకి పోయింది. దీనివల్ల పెద్ద కమతాల వ్యవసాయం ఎక్కువగా కౌలుదార్లు చేసేవారు. వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఉత్పత్తి పెరగలేదు.
 తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో 500 ఎకరాలకు పైగా భూమి ఉన్న పట్టాదారుల(భూస్వాములు) సంఖ్య 550. వీరి యాజమాన్యంలో.. మొత్తం సాగుబడిలో ఉన్న భూమిలో 60 నుంచి 70 శాతం వరకు ఉండేదని 1950-51లోని పరిపాలనా నివేదిక ద్వారా తెలుస్తోంది. మేజర్ ఇనాం భూములు కూడా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండేవి. భూకేంద్రీకరణ వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి భూ గరిష్ట పరిమితి చట్టం ఆవశ్యకత ఏర్పడింది. ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు డి.ఆర్.గాడ్గిల్ భూకమతాల గరిష్ట పరిమితిని సమర్థించారు.

రాజకీయ అంశాలు
 స్వాతంత్య్రానంతరం దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దఫా (1947-1970) భూసంస్కరణలు ప్రవేశపెట్టారు. దీనికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలు, తీర్మానాలే ముఖ్య కారణం. 1885లో ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లోని విద్యావేత్తలతో ప్రారంభమైంది. అప్పుడు పెట్టుబడిదారులు, వ్యాపారులు, మధ్య తరగతి ప్రజల సమస్యల పరిష్కారం కోసం, సివిల్ సర్వీస్ పరీక్షల నిర్వహణ, కార్పొరేషన్ అధికారాలు, శాసనసభల్లో ప్రాతినిధ్యం తదితర అంశాలపై పోరాడేవారు. 1885-1915 మధ్యకాలంలో దేశంలో పారిశ్రామికీకరణ జరపాలని, స్వదేశీ పరిశ్రమలకు రక్షణ కల్పించాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని, స్వదేశీ వస్తువుల్నే ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరిగాయి.
 గాంధీజీ రాజకీయ జీవితం 1915 తర్వాత రైతాంగం పోరాటంతో ప్రారంభమైంది. 1917-18లో బిహార్‌లోని చంపారన్ రైతుపోరాటం, ఖేడా జిల్లా రైతు విముక్తి పోరాటాలు, గ్రామీణ ప్రాంతాల్లోని బీద వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చాయి. ఫలితంగా వీరంతా స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారు. భారతదేశ సమస్యలకు పరిష్కారం న్యాయవాదులు, డాక్టర్లు, ధనిక భూస్వాముల నుంచి రాదని.. ఇది రైతాంగం నుంచే వస్తుందని గాంధీజీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర సముపార్జనలో గ్రామీణ రైతాంగమే ముఖ్యమైన శక్తిగా ఉండాలని, ఉంటుందని గాంధీజీ భావించారు.
 సహాయ నిరాకరణ, పన్నుల నిరాకరణ, శాసనోల్లంఘన మొదలైన ఉద్యమాలు పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాయి. ఈ కార్యక్రమాల్లో రైతాంగం  చురుగ్గా పాల్గొంది. వ్యవసాయదారుల సమస్యలను జాతీయ సమస్యలుగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్ గుర్తించింది. గాంధీజీ అభిప్రాయం ప్రకారం.. స్వాతంత్య్రం అంటే దేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తి చేయడమే కాదు. భారత పెట్టుబడిదారులు, భూస్వాముల దోపిడీ నుంచి రైతాంగాన్ని విముక్తి చేయటమే. 1919లో అమృత్‌సర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో దున్నేవారికే భూమి యాజమాన్యం కల్పించాలని, రైతులపై భాటకానికి బదులు పన్ను విధించాలని, జమీందారీ ప్రాంతాల్లోని కౌలుదార్లకు యాజమాన్య హక్కులు ఇవ్వాలని తీర్మానం చేశారు.
 భూస్వాముల తొలగింపు కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహించాలని జవహర్‌లాల్ నెహ్రూ కోరుకున్నారు. భారతదేశ భవిష్యత్తు రైతాంగం మీదే ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 1929 మే నెలలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. దేశ ప్రజల దారిద్య్రాన్ని తొలగించడానికి, దేశ ఆర్థిక, సామాజిక నిర్మాణంలోని అసమానతలను రూపుమాపడానికి విప్లవాత్మక మార్పులు అవసరమని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా 1931లో కరాచీలో జరిగిన  కాంగ్రెస్ సభ జమీందారీ వ్యవస్థ రద్దు చేయాలని తీర్మానించింది. 1931లో లక్నో, ఫైజాపూర్‌లో ఈ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయ పథకాన్ని రూపొందించింది.
1936 ఎన్నికల మ్యానిఫెస్టోలో భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల తర్వాత వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు.. బిహార్‌లో కౌలు భాటకాన్ని తగ్గించడం, ఉత్తరప్రదేశ్‌లో కౌలు భాటకాలు, పాత బాకీలపై, రుణాలపై మారిటోరియం విధించడం, మధ్యప్రదేశ్‌లో కౌలుదారులకు రక్షణ కల్పించడం వరకే పరిమితమయ్యాయి. 1946 ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా మధ్యవర్తులను తొలగిస్తామని తెలిపారు. మధ్యవర్తుల హక్కులను తొలగిస్తున్నందువల్ల వారికి సరైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం తర్వాత జైపూర్ కాంగ్రెస్ మహాసభలో జె.సి.కుమారప్ప అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ  సూచనల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వివిధ రకాల భూ సంస్కరణల చట్టాలు తీసుకొచ్చాయి.
 హైదరాబాద్ ప్రాంతంలో స్వాతంత్య్రానికి పూర్వం ప్రజలకు ఎటువంటి పౌరహక్కులు ఉండేవికావు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని గుర్తించపోవడమే గాక, 1946 వరకు నిషేధించింది. అందువల్ల ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ వాదులంతా సంఘటితం కాలేకపోయారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్యసమాజ్, ఆంధ్ర జనసంఘం మొదలైన సంఘాలు తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడానికి ప్రయత్నించాయి. తెలంగాణ ప్రాంతంలో 1948కు ముందు కాంగ్రెస్ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ  అధికారంలో వచ్చాక భూ సంస్కరణ చట్టాల రూపకల్పన, అమలు చేయడంలో ఆ పార్టీ ప్రధానపాత్ర పోషించింది. వ్యవసాయం, సంబంధిత రంగాల్లో విప్లవాత్మక మార్పులు భూ సంస్కరణల ద్వారానే సాధ్యమవుతాయని 1919 నుంచి కాంగ్రెస్ అనేక తీర్మానాలు చేసింది. అందువల్ల స్వాతంత్య్రం వచ్చాక అధికారంలోకి రాగానే భూ సంస్కరణలు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి, ఆ రంగ అభివృద్ధికి సహాయపడింది.

 రైతాంగ ఉద్యమాలు
 హైదరాబాద్ రాష్ర్టంలో, ప్రత్యేకించి తెలంగాణ రైతాంగం ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను నిషేధించారు. అందువల్ల ఈ పార్టీలు రైతు లేదా వ్యవసాయ కార్మిక సంఘాలను ప్రారంభించ లేకపోయాయి. కానీ రైతాంగం ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించింది. 1920లో విస్నూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా షేక్ బందగీ అనే ముస్లిం రైతు పోరాటం చేశాడు.
 1921లో తెలుగు భాషాభిమానులు భాషాభివృద్ధి కోసం, గ్రంథాలయ స్థాపన కోసం ‘ఆంధ్ర జనసంఘం’ ప్రారంభించారు. 1928లో ఇది ఆంధ్ర మహాసభగా మారింది. పరిపాలనా యంత్రాంగంలో కొన్ని సంస్కరణలు చేపట్టాలని, పౌర హక్కులు కల్పించాలని, జాగీర్ రైతుల సమస్యలను పరిష్కరించాలని, పన్నులను తగ్గించాలని, వెట్టిచాకిరి రద్దు చేయాలని ఆంధ్ర మహాసభ తీర్మానాలు చేసింది. వెట్టిచాకిరి, వ్యాపారస్థుల సంఘం అనే రెండు కరపత్రాలు ప్రచురితమయ్యాయి. క్రమంగా 1940 నుంచి వామపక్ష వాదుల సంఖ్య పెరిగింది. 1945లో ఖమ్మంలో జరిగిన మహాసభలో జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం చేయాలని తీర్మానించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొనసాగిన సాయుధ పోరాటంలో రజాకార్లు, నిజాం పోలీసుల సాయుధ దాడులను తిప్పికొట్టడానికి పదివేల మందితో గ్రామదళాన్ని, రెండు వేల మంది గెరిల్లా సభ్యులతో శక్తిమంతమైన సాయుధ బలగాన్ని కమ్యూనిస్టులు నిర్మించుకోగలిగారు.
 సుమారు 3000 గ్రామాల్లో 16,000 చదరపు మైళ్ల వైశాల్యంలో గ్రామసభలను ఏర్పాటు చేసి నిజాంకు విశ్వాసపాత్రులైన జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌లను గ్రామాల నుంచి వెళ్లగొట్టారు. గ్రామ కమిటీల ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని పునఃపంపిణీ చేశారు. వెట్టిచాకిరీ, వడ్డీ వ్యాపారం(నాగులపద్ధతి), ఇతర నిర్బంధ వసూళ్లు, నిర్బంధ లెవీ మొదలైన వాటిని రద్దు చేయటంతోపాటు బంజర భూములను పునఃపంపిణీ చేశారు. వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచారు. ఈ ప్రాంతంలో సుమారు 12 నుంచి 18 నెలల వరకు గ్రామపాలన మొత్తం రైతు కమిటీల ఆధ్వర్యంలో సాగింది. ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు హత్యకు గురయ్యారు. పదివేల మంది బందీలయ్యారు. 1945 నుంచి భారత సైన్యం ఈ సంస్థానంలోకి ప్రవేశించే వరకు నిజాం, రజాకార్లు, దేశ్‌ముఖ్‌లపై ఉన్న ద్వేషంతో గ్రామీణ ప్రజలు సాయుధ పోరాటానికి మద్దతు పలికారు. పోలీసు చర్య తర్వాత సాయుధ పోరాటం అవసరం లేదని కాంగ్రెస్ భావించింది. కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. భూ సంస్కరణల చట్టాలను ప్రవేశపెట్టి రైతాంగ పోరాటాలను అణగదొక్కింది. తెలంగాణ ప్రాంతంలోని రైతాంగ పోరాటాల ఫలితంగా అతి స్వల్పకాలంలోనే హైదరాబాద్ రాష్ర్టంలో విప్లవాత్మక భూ సంస్కరణ చట్టాలు అమలయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో భూ సంస్కరణల చట్టాలను తీసుకొని రావడానికి రైతాంగ పోరాటాలే కారణం. నిజాంకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ కోలామ్ - గోండు ఆదివాసీ గిరిజనులు కొమురం భీమ్ నాయకత్వంలో పోరాటం చేశారు. 1941లో వీరి ఆధ్వర్యంలోనే ‘భాభిజరీ (జోడేఘాట్) పోరాటం’ జరిగింది.
 రాజ్యాంగంలోని ఆర్టికల్ 339 ప్రకారం రాష్ర్టపతి గిరిజనుల సంక్షేమాన్ని పరిశీలిస్తారు. ఇందు కోసం ఐదేళ్లకు ఒకసారి తగిన చర్యలు తీసుకుంటారు. ఆర్టికల్ 342 ప్రకారం గిరిజనులను షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ)గా పేర్కొని వీరికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించారు.
Published date : 28 Sep 2015 06:09PM

Photo Stories