Skip to main content

భూసంస్కరణల ఆవశ్యకత - కారణాలు

భారతదేశంలోని రైతాంగ పోరాటాల్లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉద్యమాలే విప్లవాత్మకమైనవని కొందరు చరిత్రకారుల భావన. తెలంగాణలో జరిగిన పోరాటం ఒక్కటే విప్లవాత్మకమైందని మరికొందరు పేర్కొన్నారు. నిజాం కాలంలో అనేక రకాల భూస్వామ్య విధానాలు అమలులో ఉండేవి. వీటిలో సంస్థానాలు, జాగీర్లు, ఇనామ్‌లు, సర్ఫేఖాస్, దివానీ లేదా ఖలసా లేదా రైత్వారీ పద్ధతులు ముఖ్యమైనవి. నిజాం నవాబుకు ప్రత్యేకంగా సేవ చేసినవారికి దానంగా ఇచ్చిన భూములను జాగీర్లు అనే వారు.
స్వాతంత్య్రానంతరం భారతదేశం, రాష్ర్టంలోనూ వ్యవసాయ రంగంలో భూ సంస్కరణల పేరుతో భూ సంబంధాలు, వ్యవసాయక నిర్మాణంలో విప్లవాత్మకమైన మార్పులు రావడానికి అనేక కారణాలున్నాయి.

రాష్ర్టంలో భూ సంస్కరణలను ప్రధానంగా రెండు దశలుగా వర్గీకరించవచ్చు. మొదటి దశ 1947 నుంచి 1970 వరకు, రెండోదశ 1970 తర్వాత వచ్చిన భూ సంస్కరణలుగా పేర్కొనవచ్చు.
మొదటిదశ (1947-1970): భూ సంస్కరణలు రావడానికి మూడు అంశాలు ప్రధాన పాత్ర వహించాయని చెప్పొచ్చు.
  1. వ్యవస్థాపూర్వక అంశాలు: ఇందులో భూ స్వామ్య పద్ధతులు, కౌలు విధానాలు, భూ కేంద్రీకరణ మొదలైనవి ఉన్నాయి.
  2. రాజకీయ అంశాలు: జాతీయస్థాయిలో అఖిల భారత కాంగ్రెస్, రాష్ర్ట కాంగ్రెస్ తీర్మానాలు, విధానాలు.
  3. రైతాంగ ఉద్యమాలు: ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరాటం చేసింది. ఉదా: 1920లో విస్నూరు దేశ్ ముఖ్‌కు వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటం.
భారతదేశ రైతాంగ పోరాటాల్లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైతాంగ పోరాటాలే విప్లవాత్మకమైనవని కొందరు భావిస్తే, మరికొందరు తెలంగాణ పోరాటం ఒక్కటే విప్లవాత్మకమైందిగా పేర్కొంటారు.

I. వ్యవస్థాపూర్వక అంశాలు
రాష్ర్టంలో వ్యవస్థాపూర్వకమైన అంశాల్లో భూస్వామ్య వ్యవస్థలు, కౌలు విధానాలు, భూమి కేంద్రీకరణ మొదలైనవన్నీ వ్యవసాయ రంగం అభివృద్ధికి నిరోధంగా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అవతరణ (1956) కు ముందు తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ర్టంలో, ఆంధ్రా ప్రాంతం 1953 అక్టోబర్ 1 వరకు మద్రాసు రాష్ర్టంలో భాగంగా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని భూస్వామ్య పద్ధతుల్లో కొంత సారూప్యం ఉన్నప్పటికీ వీటిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వేర్వేరుగా అధ్యయనం చేయడం ఉత్తమం.
  • భారతదేశంలో బ్రిటిష్, నైజాం ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన భూస్వామ్య పద్ధతులు రెండూ అభివృద్ధి నిరోధకాలే.
  • తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన జాగీర్దారీ లేదా జమీందారీ, రైత్వారీ మొదలైన పద్ధతులు వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడకపోగా స్తబ్ధతకు దారితీశాయి.
  • జమీందారీ, రైత్వారీ పద్ధతులు రెండూ బ్రిటిష్ అధికారులు ప్రవేశపెట్టిన వ్యవసాయక విప్లవ రూపాలు. ఇవి ఒకదానికొకటి విరుద్ధమైనవిగా కార్ల్ మార్క్స్ గుర్తించారు. జమీందారీ విధానం పెత్తందారీ వ్యవస్థ కాగా, రైత్వారీ విధానాన్ని ప్రజాతంత్ర వ్యవస్థగా పేర్కొన్నారు.
  • జమీందారీ విధానం బ్రిటిష్ భూస్వామ్య వ్యవస్థకు, రైత్వారీ విధానం ఫ్రెంచి రైతుస్వామ్య వ్యవస్థకు ప్రతిబింబాలు. కానీ ఈ రెండు పద్ధతులు హానికరమైనవేనని గుర్తించాలి. ఇవి రెండూ పరస్పర విరుద్ధ అంశాల మేళవింపుతో రూపొందాయి.
  • ఈ పద్ధతులు భూమిని దున్నే రైతు, భూ యజమానుల ప్రయోజనాలకు ఉద్దేశించినవి కావు. భూములపై పన్ను వేసి, ప్రభుత్వానికి ఉపయోగపడే సాధనాలుగా గుర్తించారు.
హైదరాబాద్ రాష్ర్టంలో భూస్వామ్య విధానాలు
  • హైదరాబాద్ రాష్ర్టం నిజాం పరిపాలనలో ఉండేది. వీరి కాలంలో అనేక రకాల భూస్వామ్య విధానాలుండేవి. అవి సంస్థానాలు, జాగీర్లు, ఇనాంలు, సర్ఫేఖాస్, దివానీ లేదా ఖలసా లేదా రైత్వారీ విధానాలు ముఖ్యమైనవి.
1. జాగీర్లు
నిజాం నవాబుకు ప్రత్యేకంగా సేవ చేసినవారికి లేదా ఆ వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికి దానపూర్వకంగా ఇచ్చిన భూములను జాగీర్లు అనే వారు. వీటిలో అనేక రకాలైన జాగీర్లుండేవి. కొన్ని నిజాంకు కొంత బాటకం చెల్లించాల్సినవి. కొన్ని భాటకం చెల్లించనవసరం లేని జాగీర్లు.

2. ఇనాందారులు
  • హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని విధులను నిర్వహించినందుకు పారితోషికంగా ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇనాం భూములంటారు.
  • ఈ భూముల నుంచి వచ్చే భూమి శిస్తును పొందే హక్కు పూర్తిగానో, పాక్షికంగానో ఇనాందారుడికి సంక్రమిస్తుంది.
  • ఉద్యోగులు, సమాజానికి సేవలు అందించిన వారికి కూడా ఇనాం భూములు ఇచ్చేవారు.
  • దేవాలయాలు, ధర్మాలయాల నిర్వహణకూ ఇనాంలు ఇచ్చేవారు.
హైదరాబాద్ సంస్థానంలో మొత్తం ఇనాందారుల సంఖ్య 82,000 కాగా వీరిలో
57,000 మంది దివానీప్రాంతంలో ఉండగా 26000 మంది జాగీరు ప్రాంతంలో ఉండేవారు. వీరి ఆధీనంలో సుమారు 8 లక్షల ఎకరాల భూమి ఉండేది. వీటిలో కూడా అనేక రకాలైన ఇనాంలు ఉండేవి.
ఉదా: అరాజమక్తా, అరాజ అగ్రహార్, మజరాను బేసరి ఇనాం, బలవతా ఇనాం, నీరడి ఇనాం, చిధుమతి ఇనాం మొదలైనవి.

3. సర్ఫేఖాస్
  • సర్ఫేఖాస్ భూములు నిజాం సొంత ఖర్చుల కోసం నిర్దేశించిన భూమి లేదా గ్రామాలు. వీటి నుంచి వచ్చే ఆదాయం లేదా భాటకం నిజాం ఖజానాకు వెళ్లేది. ఈ భూములు 5,682 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 1,374 గ్రామాల్లో వ్యాపించి ఉండేవి.
4. ఖల్సా/దివానీ/రైత్వారీ పద్ధతి
  • ఈ పద్ధతి హైదరాబాద్ ప్రాంతంలోని 60 శాతం విస్తీర్ణంలో ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కింద ఉండేది. ప్రభుత్వ యంత్రాంగమే శిస్తు వసూలు చేసేది.
  • ప్రభుత్వ యంత్రాంగమే శిస్తును వసూలు చేసే ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండే భూమిని ఖలీసా భూమి అంటారు.
  • దివానీ భూములు సర్ఫేఖాస్ భూముల్లో భాగాలే.
  • క్రమబద్ధమైన సర్వే సెటిల్‌మెంట్ పద్ధతిని మొదటి సాలార్‌జంగ్ 1875లో ప్రవేశపెట్టారు.
  • క్రమబద్ధమైన సర్వే సెటిల్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి (1875) ముందు ఖల్సా/దివానీ భూముల్లో దళారీలు ఉండేవారు. పామిగా జమీయత్
  • పామిగా అంటే గుర్రాలను కట్టేసే స్థలం
  • సైన్యానికి అవసరమైన గుర్రాలను పోషించడానికి ప్రతిఫలంగా ఇచ్చే జాగీర్లు. జాత్
  • విస్తృతమైన ప్రాంతాల్లో సేవ చేసినందుకు ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చిన జాగీర్లు అవతమామ్
  • శిస్తు చెల్లించకుండానే వంశ పారంపర్యంగా వచ్చే హక్కులు ఉన్న జాగీర్లు తనఖా
  • జీతానికి బదులుగా ఇచ్చే జాగీర్లు మాదద్ మాష్
  • ఉద్యోగుల పోషణకు జీతానికి తోడుగా ఇచ్చే జాగీర్లు మసురూదీ
  • మత, సైనిక, పౌర సంబంధమైన సేవ చేసే షరతులపై ఇచ్చే జాగీర్లు
  • పై విధంగా అనేక రకాలైన జాగీర్లు ఉండేవి. ఈ జాగీర్లు హైదరాబాద్‌లో 6535 గ్రామాల్లో 40,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేవి. 1922లో జాగీర్ల సంఖ్య 1,167 కాగా, 1949 నాటికి 1500 వరకు పెరిగింది.
5. సంస్థానాలు
హైదరాబాద్ ప్రాంతంలో మొదటి నుంచి అనేక చిన్న చిన్న ప్రాంతాలకు హిందూ రాజులు అధిపతులుగా ఉండేవారు. నిజాం వీరి హక్కులను అంగీకరించడానికి వీరు ఏటా నిజాంకు ‘పేష్కష్’ పేరుతో నిర్ణీతమైన డబ్బు చెల్లించాలి. వీరికి ఆయా ప్రాంతాల్లో విస్తృతమైన పరిపాలనా అధికారాలుండేవి.

హైదరాబాద్ రాష్ర్టంలో మొత్తం 14 సంస్థానాలు ఉన్నప్పటికీ, వీటిలో ఐదు ప్రధానమైనవి. అవి
1) గద్వాల్ (అతి పెద్దది)
2) వనపర్తి
3) జట్టిప్రోలు
4) అమరచింత
5) పాల్వంచ.
ఈ ఐదు సంస్థానాల్లో పరిపాలన అంతా సంస్థానాధీశులదే. వీరి ఆధీనంలో 497 గ్రామాలు, 5,030 చదరపు మైళ్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేవి. వీరికి సర్‌బస్తా, పాన్‌మక్తా, ఇజారా అనే మధ్యవర్తులుండేవారు.
సర్‌బస్తా: వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసుకునే హక్కును పొందినవారు.
పాన్‌మక్తా: స్థిరమైన కౌలును చెల్లించేవారు.
ఇజారా భూములు: నిర్మానుష్యమైన గ్రామాల్లోని భూములు. ఇక్కడ పునరావాసం ఉండే వారికి తక్కువ కౌలు చెల్లించే వెసులుబాటు ఉండేది.
  • ప్రాంతీయంగా ఉండే వీరినే దేశ్‌ముఖ్, సర్‌దేశ్‌ముఖ్, దేశాయ్, సర్‌దేశాయ్, దేశ్‌పాండేలుగా పిలిచేవారు. వీరికి శిస్తు వసూలు చేసే అధికారం ఉండటం వల్ల అనేక మార్గాల ద్వారా వేల ఎకరాలు తమ పేరున రాసుకొని 1875 తర్వాత ఖల్సా / దివానీ ప్రాంతాల్లో అతిపెద్ద భూస్వామ్యులుగా చెలామణి అయ్యారు.
  • పై భూస్వామ్య విధానాలన్నింటిలోనూ జాగీర్దార్లు, ఇనాందార్లు, సంస్థానాధీశులు చివరకు భాటకాన్ని పొందే ఖల్సా ప్రాంతంలోని పెద్ద భూస్వాములందరూ భాటకాన్ని పొందే అనుపస్థితి (అబ్సెంటీ ల్యాండ్‌లార్‌‌డ్స) భూస్వాములుగా మారారు. వీరి సంఖ్య 1891లో లక్ష ఉండగా 1921 నాటికి 7.6 లక్షలకు పెరిగింది.
  • ఈ ప్రాంతంలో భాటకం వసూలు చేసేవారు వ్యవసాయాభివృద్ధి కంటే కౌలును పెంచుకునే మార్గాలను అన్వేషించేవారు.
  • భూమి శిస్తును ఉత్పత్తితో సంబంధం లేకుండా పెంచడం, కౌలు గడువు పెంచుకోవాలన్నా కొత్తగా సేద్యం చేసుకోవడానికి భూమిని తీసుకోవాలన్నా వీరికి ‘నజరానాలు’ (బహుమతులు) చెల్లించాల్సి వచ్చేది.
  • భూమిశిస్తుతోపాటు ఇంటి పన్ను, వృత్తిపన్ను, మగ్గపు పన్ను..ఇలా అనేక అక్రమ పన్నులు నిర్బంధంగా వసూలు చేసేవారు.
  • వీరి ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా రైతులు, కౌలుదారులు విధిగా చేసే వెట్టి చాకిరీ తోపాటు కట్నాలు, కానుకలు చెల్లించేవారు.
  • ఫలవృక్షాలు, చింతచెట్లు మొదలైనవి జాగీర్దార్ల ఆస్తిగా భావించేవారు.
  • వీరి దోపిడీ హైదరాబాద్ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండేది. హైదరాబాద్ సంస్థాన రెవెన్యూ ఆదాయం రూ. 8 కోట్లు కాగా హైదరాబాద్ ప్రాంతంలోని 110 మంది జమీందార్ల ఆదాయం రూ. 10 కోట్లు ఉండేది.
  • నిజాం జారీ చేసిన ఫర్మానాలో 82 రకాలైన అక్రమ నిర్బంధ వసూళ్లు ఉండేవని తెలుస్తుంది.
  • కులమతాలు, వయసు, లింగ భేదాలతో సంబంధం లేకుండా అందరూ వెట్టి చాకిరీ చేయడం ఈ ప్రాంతం అంతటా ఉండేది.
  • అత్యధికమైన భూ కేంద్రీకరణ, అధికార బలం, ఆర్థికబలం, అంగబలం వల్ల ఫ్యూడల్ దోపిడీ నిరాటంకంగా కొనసాగింది. దీంతోపాటు వడ్డీవ్యాపారం, నిర్బంధ లేవీ పద్ధతి, ఆర్థికమాంద్యం మొదలైనవాటితో రైతాంగం పూర్తిగా కుంగిపోయింది. రైతాంగం కౌలుదారులు, వ్యవసాయ కూలీలు మారడమో, వలస వెళ్లడమో జరిగింది.
కౌలుదారీ విధానాలు
  • హైదరాబాద్, ఆంధ్రా ప్రాంతంలోనూ భూస్వామ్య పద్ధతుల్లో ఉండే లోపాల వల్ల భాటకం వసూలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల కౌలుదారీ సంబంధాలు ఉండడం సర్వ సాధారణ విషయంగా మారింది.
హైదరాబాద్ రాష్ర్టంలో కౌలు విధానాలు
  • హైదరాబాద్ సంస్థానంలో 1354 ఫసలీ (1944)లో ఆసామీ షక్మి చట్టం అమలులోకి వచ్చే నాటికి రెండు రకాలైన కౌలుదార్లు ఉండేవారు.
షక్మిదారులు: వీరే శాశ్వత కౌలుదారులు. కౌలుదారునికి రక్షణ, భూమిని సాగు చేసుకునే హక్కులు ఉన్న వారే షక్మిదారులు.
ఆసామీ షక్మిదారులు: వీరు ఏ హక్కులు లేని కౌలుదారులు. ఆసామీ షక్మిదారులు కౌలుభూమిని 12 ఏళ్లు తన స్వాధీనంలో ఉంచుకోగలిగినప్పుడు షక్మిదారులుగా గుర్తింపు లభించేది. కానీ హైదరాబాద్ సంస్థానం వంటి ఫ్యూడల్ వ్యవస్థలో ఏ హక్కులు లేని కౌలుదారుడు పన్నెండేళ్లు కౌలుభూమిని తన స్వాధీనంలో ఉంచుకోవడం జరగదు. ఒకవేళ పన్నెండేళ్లు ఒకే భూమిని కౌలు పద్ధతిలో సాగు చేస్తున్నప్పటికీ దాన్ని రుజువు చేసుకోవడం అంత సులభం కాదు. దీంతో కౌలుదారులందరూ ఆసామి షక్మిదారులు (రక్షణలేని కౌలుదారులు)గానే ఉండేవారు.
Published date : 23 Sep 2015 03:32PM

Photo Stories