Skip to main content

భారతదేశ హిమాలయ నదీ వ్యవస్థ

నదీ వ్యవస్థ వల్ల వ్యవసాయంతో పాటు, పారిశ్రామిక, రవాణా రంగాల పరంగా భారతదేశం ఎంతో లబ్ధి పొందుతోంది. నదీ వ్యవస్థ ద్వారానే వ్యవసాయ రంగానికి అవసరమైన ఒండ్రు మట్టి నేలలు, డెల్టాలు సమకూరుతున్నాయి. దేశంలోని నదులను హిమాలయ, ద్వీపకల్ప నదులుగా విభజించవచ్చు. వీటితో పాటు అంతర్ భూభాగ నదులు కూడా భారతదేశంలో ఉన్నాయి.
హిమాలయ నదీ వ్యవస్థ (లేదా) జీవ నదీ వ్యవస్థ
ఈ నదులు సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం కలిగుంటాయి. కాబట్టి వీటిని జీవ నదులు అంటారు.
వీటిలో కొన్ని పూర్వ వర్తిత రకానికి చెందినవి. అంటే ఆయా నదులు హిమాలయాలు ఆవిర్భవించక ముందే ఆ ప్రాంతంలో జన్మించాయి.
మరికొన్ని నదులు అంతరవర్తిత రకానికి చెందినవి. అంటే ఆ నదులు హిమాలయాల ఆవిర్భావంతర్వాత జన్మించాయి. ఇవి ద్వీపకల్ప నదులతో పోల్చితే తక్కువ వయసు కలిగుంటాయి.

హిమాలయ నదీ వ్యవస్థలో ప్రధానంగా మూడు నదీ వ్యవస్థలున్నాయి. అవి..
1) సింధు నదీ వ్యవస్థ
2) బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ
3) గంగా నదీ వ్యవస్థ

సింధు నదీ వ్యవస్థ
సింధు నది టిబెట్‌లోని మానస సరోవరం దగ్గర ఉన్న ‘గర్తాంగ్ చూ/బొఖార్ చూ’ నుంచి ప్రారంభమవుతుంది. టిబెట్‌లో దీన్ని ‘లంగ్ చన్ కంబాబ్’ (లేదా) ‘సింగి కంభమ్’ అని పిలుస్తారు. టిబెట్, జమ్మూకశ్మీర్, పాకిస్తాన్‌ల మీదుగా ప్రవహించి చివరకు పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది.
  • దీని మొత్తం పొడవు 2,880 కి.మీ. కాగా భారతదేశంలో 709 కి.మీ. ప్రవహిస్తుంది.
  • సింధు పరీవాహక ప్రాంతం 3,21,000 చ.కి.మీ.
  • సింధు నది లడఖ్, జస్కార్ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహించి తల్బల వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
    సింధు కుడి ఉపనదులు (పర్వతీయ ఉపనదులు)
    షోక్, గిల్గిట్, జష్కర్, ద్రాస్, గర్తాంగ్, హుంజా, తోచి, కాబూల్ మొదలైనవి.
    సింధు ఎడమ ఉపనదులు (మైదాన ఉపనదులు)
  • జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ తదితరాలు.
  • అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతి పెద్దది, పొడవైనది సింధు నది.
  • ఇది భారతదేశంలో కేవలం జమ్మూకశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది.
జీలం: దీని ప్రాచీన నామం ‘వితస్త’. జమ్మూకశ్మీర్‌లోని ‘పిర్‌పంజాల్’లో ఉన్న వెరినాగ్ వద్ద జన్మిస్తుంది. ఈ నది వల్ల శ్రీనగర్ వద్ద ఊలార్ సరస్సు ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌లో కొంత దూరం భారత్, పాక్ సరిహద్దుగా ఉంటుంది. ట్రిమ్ము వద్ద చీనాబ్‌లో కలుస్తుంది.
చీనాబ్: దీని ప్రాచీన నామం ‘అస్కిని’. హిమాచల్‌ప్రదేశ్‌లోని బారాలాప్చాలా కనుమ వద్ద జన్మిస్తుంది. చంద్ర, భాగ అనే రెండు చిన్న నదుల కలయికతో ఏర్పడుతుంది. ఇది అక్నూర్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశించి పంచ్‌నాడ్ వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఇది సింధు నది ఉపనదుల్లో అత్యధిక నీటిని తీసుకువస్తుంది.
రావి: ప్రాచీన నామం పరూష్ని. దీన్ని ఐరావతి నది, లాహోర్ నది అని కూడా పిలుస్తారు. కులు కొండల్లోని రోహ్‌తంగ్ కనుమ వద్ద జన్మిస్తుంది. రంగాపూర్ వద్ద చీనాబ్ నదిలో కలుస్తుంది.
బియాస్: ప్రాచీన నామాలు విపస, అర్గికియా. కులు లోయలోని రోహ్‌తంగ్ కనుమ వద్ద గల బియాస్‌కుండ్ వద్ద జన్మించి, దౌలాధార్ శ్రేణిని చీలుస్తూ కాంగ్రా లోయ గుండా ప్రవహించి కపుర్తల వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఇది పూర్తిగా భారతదేశంలో మాత్రమే (కశ్మీర్) ప్రవహిస్తుంది.
సట్లెజ్: ప్రాచీన నామం శతుద్రి. ఇది 4,630 మీ. ఎత్తులో సింధూ నది జన్మస్థానానికి సమీపాన, మానస సరోవరానికి దగ్గర్లోని రాకాసి సరస్సు వద్ద జన్మించి, షిష్కిల కనుమ గుండా భారత్‌లోకి ప్రవేశించి మిథాన్‌కోట్ వద్ద అన్ని ఉపనదులను కలుపుకొని సింధూ నదిలో కలుస్తుంది.
  • సింధూ ఉపనదుల్లో పొడవైనది సట్లెజ్ (1450 కి.మీ.)
  • సట్లెజ్ నది మైదానంలోకి ప్రవేశించేప్రాంతం- రూపానగర్
  • భారతదేశంలో సట్లెజ్ నది పొడవు 1050 కి.మీ.
  • 1960 సెప్టెంబర్ 19న జరిగిన Indus water Treaty ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదుల్లోని నీటిని భారతదేశం వాడుకుంటుంది.
  • భారత్‌లో జీలం నది ఒడ్డున శ్రీనగర్, సట్లెజ్ నది ఒడ్డున లుథియానా, ఫిరోజ్‌పూర్ నగరాలు ఉన్నాయి.

బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ
  • టిబెట్‌లోని మానస సరోవరం వద్ద గల ‘షమ్‌యంగ్ డమ్’ అనే హిమానీ నదం వద్ద బ్రహ్మపుత్ర నది జన్మించి, తూర్పు దిశగా.. ప్రధానంగా చైనాలోని టిబెట్, భారత్, బంగ్లాదేశ్‌లో సుమారు 2990 కి.మీ. దూరం ప్రయాణి స్తుంది. బంగ్లాదేశ్‌లో గంగానదితో కలిసి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది.
  • బ్రహ్మపుత్ర టిబెట్‌ను దాటి భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని నామ్చాబర్వా వద్ద ‘యూ’ ఆకారంలో తిరిగి జిదాలో ప్రవేశిస్తుంది. అనంతరం అసోంలోని సాదియా మైదాన ప్రాంతం గుండా సుమారు 885 కి.మీ. భారత్‌లో ప్రవహిస్తుంది.
  • ఈ నది ప్రయాణించే మార్గంలో దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. టిబెట్‌లో త్సాంగ్ పో అని, అరుణాచల్‌ప్రదేశ్‌లో దిహాంగ్, సియాంగ్ అని,అసోంలో సైడాంగ్, ఉత్తర బంగ్లాదేశ్‌లో పద్మా నది (గంగానది)ని కలవక ముందు జమున అని, దక్షిణ బంగ్లాదేశ్‌లో (పద్మా నదిని కలిసిన తర్వాత) మేఘన అనే పేర్లతో పిలుస్తారు.
  • అసోంలోని ఎర్ర నేలల మీదుగా ప్రవహించడం వల్ల దీన్ని ఎర్ర నది అని కూడా పిలుస్తారు.
  • ప్రపంచంలోని అతి పెద్ద సుందర్‌బన్స్ డెల్టా... బ్రహ్మపుత్ర, గంగా నదుల కలయిక వల్ల ఏర్పడింది.
  • భారతదేశంలో గల ఏకైక నదీ ఆధారిత దీవి మాజులీ (అసోం) ఈ నది వల్లే ఏర్పడింది.
  • బహ్మ్రపుత్ర నదిని అసోం దు:ఖదాయని అని పిలుస్తారు.
ఉప నదులు: ధన్‌సిరి, సబన్‌సిరి, సంకోష్, రైడాక్, అమొచు, మనస్, భరేలి, లోహిత్, సుర్మ, తీస్తా, గంగాధర్, బేల్‌సిరి, దిబ్రు, డిక్కు, దిబాంగ్, లోహిత్ మొదలైనవి.
గమనిక: తీస్తా నది టిబెట్‌లోని చితము సరస్సు వద్ద జన్మిస్తుంది. తీస్తా 1887 వరకు గంగా నది ఉపనదిగా ఉండేది. కానీ 1887లో వచ్చిన భూకంపం వల్ల దీని ప్రవాహ దిశ మారి బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారింది.
బ్రహ్మపుత్ర నదికి వచ్చే వరదలతో అధికంగా నష్టపోతున్న రాష్ట్రం అసోం.

గంగా నదీ వ్యవస్థ
అలక్‌నంద నది దేవ ప్రయాగ వద్ద భగీరథితో కలిసిన తర్వాత గంగా నదిగా పిలుస్తారు. అలక్‌నంద ‘అల్క’ అనే హిమానీ నదం వద్ద, భగీరథి... గంగోత్రి అనే హిమానీ నదం వద్ద జన్మించాయి.
  • అలక్‌నంద, పిండార్ నదులు కలిసే ప్రదేశం కరణ్‌ప్రయాగ. అలక్‌నంద, మందాకిని కలిసే ప్రదేశం రుద్రప్రయాగ.
  • గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశం (త్రివేణి సంగమం) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ (లేదా) అలహాబాద్.
  • గంగానది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశించి.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి బెంగాల్‌లో రెండు ప్రధాన శాఖలుగా చీలుతుంది. దీనిలో ఒక శాఖ పద్మానదిగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి, బ్రహ్మపుత్రతో కలిసి ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. మరో శాఖ హుగ్లీ నదిగా పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది.
  • గంగానది భారతదేశంలో ఎక్కువ దూరం ఉత్తరప్రదేశ్‌లో (1450 కి.మీ.) ప్రవహిస్తుంది. దీని మొత్తం పొడవు 2525 కి.మీ. కాగా భారత్‌లో దీని పొడవు సుమారు 2415 కి.మీ. ఇది భారతదేశంలో అతి పొడవైన నది, అతి తరుణ నది. దేశంలో ని వైశాల్యంలో 4వ వంతు ఆక్రమించి, అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాన్ని కలి గి ఉంది. దీనికి గల మరో పేరు జాహ్నవి.

గంగా ఎడమ వైపు ఉపనదులు:
రామ్ గంగా, గోమతి, ఘగ్ర, గండక్, కోసి తదితర హిమాలయ నదులు ఎడమవైపు నుంచి గంగా నదిలో కలుస్తాయి.
 
గంగా కుడివైపు ఉపనదులు: యమున, చంబల్, సోణ్, బెట్వా, కెన్, దామోదర్, టాన్స్ మొదలైన ద్వీపకల్ప నదులు కుడివైపు నుంచి గంగా నదిలో కలుస్తాయి. 
 
గండక్ : నేపాల్‌లోని ఎవరెస్ట్, ధవళగిరి శిఖరాల మధ్య గల సోహాతు కనుమ వద్ద  సుమారు 7000 మీ. ఎత్తులో జన్మించింది. అందువల్ల దీన్ని భారతదేశంలో ఎత్తై ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నదిగా పరిగణిస్తారు. గండక్ నదిని నేపాల్‌లో సాలిగ్రామి, బిహార్‌లో నారాయణి అని పిలుస్తారు. ఇది పట్నా వద్ద గంగానదిలో కలుస్తుంది.
 
కోసీ: దీన్ని సంస్కృతంలో కౌశికి అంటారు. కోసికి బిహార్ దు:ఖదాయని అని పేరుంది. కోసి నది నేపాల్, టిబెట్, సిక్కిం సరిహద్దుల్లో గల గోసాయ్ నాధీ వద్ద జన్మించి, కాంచన్‌గంగా పర్వత శిఖరాన్ని తాకుతూ కోసీచాత్ర మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది. బిహార్‌లో గంగానదిలో కలుస్తుంది. దీని ఉప నదులు అరుణ్, సన్‌కోసి, దుద్‌కోసి తదితరాలు. 
 
గాగ్రా: కర్ణాలి అని కూడా పిలుస్తారు. నేపాల్‌లోని గుర్ణమాంధీత శిఖరం వద్ద జన్మించి, బిహార్‌లోని ధాప్రా వద్ద గంగానదిలో కలుస్తుంది. దీని ఉపనది శారదా. చౌక, కాళి అని కూడా శారదా నదిని పిలుస్తారు. 
 
యమునా: యమునోత్రి అనే హిమానీ నదం వద్ద జన్మించి, ముస్సోరి కొండలను దాటి తజేవాలా అనే ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది. అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. దీని పొడవు 1376 కి.మీ.
యమునా నది ఒడ్డున మధుర, ఆగ్రా, ఢిల్లీ నగరాలున్నాయి. ఇది గంగానది ఉపనదుల్లో అతి పెద్దది. దీని ఉప నదులు చంబల్, బెట్వా, కెన్, కాల్‌సిధి.
 
చంబల్: మధ్యప్రదేశ్‌లోని జన్‌పావో కొండల్లోని మౌ అనే ప్రదేశంలో జన్మించి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో యమునా నదిలో కలుస్తుంది. దీని పొడవు 960 కి.మీ. ఆరావళి పర్వతాల్లో బనాస్ నది దీనిలో కలుస్తుంది.
 
బెట్వా:  నేత్రావతి నది అని కూడా పిలుస్తారు. ఇది మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో జన్మించి సాంచి, గ్వాలియర్, ఝాన్సీల గుండా ప్రవహించి హమీర్ పూర్ వద్ద యమునా నదిలో కలుస్తుంది.
 
కెన్: కైమూర్ కొండల్లో జన్మించి బుందేల్‌ఖండ్ పీఠభూమి గుండా ప్రవహించి బాండ వద్ద యమునా నదిలో కలుస్తుంది. దీన్ని కర్ణావతి నది అని కూడా పిలుస్తారు.
 
సోన్: మధ్యప్రదేశ్‌లోని అమర్ కంటక్ పీఠభూమిలో జన్మించి, నర్మదా నదికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల గుండా ప్రవహించి పట్నా వద్ద గంగా నదిలో కలుస్తుంది.
 దీని  ఉపనదులు : మహానందా, గోవత్, రిహాండ్, కన్హర్ తదితరాలు. దీన్ని సువర్ణ నది అని కూడా పిలుస్తారు. 
 
దామోదర్: జార్ఖండ్‌లోని ఛోటానాగ్‌పూర్ పీఠభూమిలోని టోరీ అనే ప్రాంతంలో జన్మించి, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు దిగువన హుగ్లీ నదిలో కలుస్తుంది. దీన్ని బెంగాల్ దు:ఖదాయని అని కూడా పిలుస్తారు. బరాకర్, కోనార్, గరి, జమునై దీని ఉపనదులు.
 
టాన్స్:  కైమూర్ పర్వతాల్లోని గోమచి శిఖరాల్లోని మైహర్ వద్ద జన్మించి, అలహాబాద్ నగరానికి దిగువన సిర్స వద్ద గంగానదిలో కలుస్తుంది. దీనికి గల మరో పేరు తామస.
 
మహానంద: పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లోని మహల్దీరామ్ కొండల్లో పుట్టి, బెంగాల్‌లోని మహానంద శాంక్చ్యురీ నుంచి ప్రవహించి సిలిగురి, జల్‌పాయ్‌గురి జిల్లాల మీదుగా బంగ్లాదేశ్‌లో పద్మానదిలో కలుస్తుంది.
 
దేశంలోని 77 శాతం నదులు బంగాళాఖాతంలో, 23 శాతం నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. దేశంలోని మొత్తం నీటి పరిమాణంలో 90 శాతం నీరు బంగాళాఖాతంలో కలుస్తుంటే, 10 శాతం నీరు అరేబియా సముద్రంలో కలుస్తోంది. జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికలో ప్రస్తుతం 38 నదులను చేర్చారు. భారతదేశంలోని నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా కేఎల్ రావు... నదీ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించారు. అవి..
 
భారీ నీటి పారుదల వ్యవస్థ
సుమారు 10,000 చ.కి.మీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇది ఉంటుంది. దేశంలో 14 పెద్ద నదులతో 85 శాతాన్ని ఈ వ్యవస్థ ఆక్రమించింది.
 
 మధ్య తరహా నీటి పారుదల వ్యవస్థ
 సుమారు 2,000 చ.కి.మీ నుంచి 10,000 చ.కి.మీ. విస్తీర్ణం వరకు ఉంటుంది. ఇది 44 నదులతో దేశంలో 7 శాతాన్ని ఆక్రమిస్తుంది.
 
 చిన్న తరహా నీటి పారుదల వ్యవస్థ
 2000 చ.కి.మీ. కంటే తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. చిన్న చిన్న వాగులు, వంకలతో కలిపి 8 శాతాన్ని ఈ వ్యవస్థ ఆక్రమిస్తుంది.
Published date : 13 Aug 2016 05:27PM

Photo Stories