TSLPRB: చిన్న ఐడియా.. 670 కొలువులు!
అలాంటి ఓ ఆలోచన పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఇబ్బందులను పోగొట్టింది. ముందు నుంచే ఉన్న ఇబ్బందిపై సరిగా దృష్టిపెట్టకపోవడంతో సమస్యగా మారితే.. ఒక చిన్న మార్పుతో దాన్ని సరిచేసి వందల మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించగలిగారు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్ పీఆర్‌బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు.
చదవండి: TSPLRB: పోలీసు ఉద్యోగాల భర్తీలో గర్భిణులకు మరో అవకాశం
సమస్య ఏమిటి?
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ వేసిన ప్రతీ సారి కూడా ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాలు చేపడుతుంది. అభ్యర్థుల్లో తక్కువ మంది మాత్రమే కేవలం ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేస్తారు. నూటికి 99% మంది ఎస్సైతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకూ పోటీపడుతుంటారు. వారిలో ప్రతిభావంతులు రెండు పరీక్షల్లోనూ పాసవుతారు. అయితే ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచీ తొలుత కానిస్టేబుల్ సెలక్షన్స్, తరువాత ఎస్సై సెలక్షన్స్ జరిగేవి. దీనివల్ల మొదట కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికై, శిక్షణకు వెళ్లినవారు కూడా.. తర్వాత ఎస్సై పోస్టుకు ఎంపికైతే కానిస్టేబుల్ పోస్టును వదులుకునేవారు. ఇలా వందలాది పోస్టులు ఖాళీ అయ్యేవి. అప్పటికే కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయి, ఖాళీ పోస్టులను డీజీపీకి సరెండర్ చేసి ఉండేవారు. పరీక్షల్లో అర్హత సాధించినవారు ఎందరో ఉన్నా ఈ ఖాళీల్లో భర్తీ చేసే అవకాశం ఉండేది కాదు. ఆ పోస్టులను తర్వాతి రిక్రూట్‌మెంట్‌లోనే భర్తీ చేయాల్సి వచ్చేది. దీనివల్ల చాలా మంది అభ్యర్థులు వయసు పెరగడం, శారీరక ఇబ్బందులతో పోటీపడే అవకాశం కోల్పోయేవారు.
చదవండి: TSLPRB: ‘ఆ అభ్యర్థులకు’ మరో అవకాశం
ఏం మార్పులు చేశారు?
ఈ లోపాన్ని గుర్తించిన టీఎస్‌ఎల్ పీఆర్‌బీ చైర్మన్ శ్రీనివాసరావు.. విషయాన్ని అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డికి వివరించారు. ఆయన ఆమోదంతో గత రిక్రూట్‌మెంట్ సందర్భంగా ముందుగా ఎస్సై సెలక్షన్స్ చేపట్టారు. ఎస్సై ట్రైనీలతో సమావేశం నిర్వహించి.. వారిలో 670 మంది కానిస్టేబుల్ పోస్టులకు అర్హత సాధించారని గుర్తించారు. ముందే ఎస్సై పోస్టులో చేరుతున్నందున కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరబోమంటూ అండర్ టేకింగ్ (నిరభ్యంతర పత్రం) తీసుకున్నారు. తర్వాత చేపట్టిన కానిస్టేబుల్ సెలక్షన్స్ జాబితా నుంచి ఆ 670 మందిని తొలగించారు. దీంతో ఇదే సంఖ్యలో ఇతర అభ్యర్థులు ఎంపికయ్యారు. ఖాళీలేమీ ఏర్పడలేదు. మరోవైపు ట్రాఫిక్ అఫెన్స్‌లు, తెలిసీ తెలియని చిన్న నేరాలకు సంబంధించిన కేసులు ఉన్న 350 మందికిపైగా అభ్యర్థులపై వేగంగా దర్యాప్తు పూర్తి చేయించి.. ఉద్యోగ అవకాశం లభించేలా చేశారు.