Skip to main content

TSLPRB: పోలీస్‌ పరీక్షల రీకౌంటింగ్‌ ఫలితాలు.. ఎడిట్‌ ఆప్షన్‌ కోసం చివరి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం సర్వీసెస్‌ కొలువుల భర్తీలో భాగంగా వివిధ విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు నిర్వహించిన తుదిరాత పరీక్ష ఫలితాల్లో రీ వెరిఫికేషన్, రీకౌంట్‌కు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థుల ఫలితాలను జూన్‌ 6న వెల్లడించనున్నారు.
TSLPRB
పోలీస్‌ పరీక్షల రీకౌంటింగ్‌ ఫలితాలు.. ఎడిట్‌ ఆప్షన్‌ కోసం చివరి తేదీ ఇదే..

రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోసం మొత్తం 1,338 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు బోర్డు చైర్మన్‌ వివి శ్రీనివాసరావు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా  వివిధ విభాగాల్లోని ఎస్సై అభ్యర్థుల్లో అర్థమెటిక్, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ల్లో 185 మంది, ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో ఏఎస్సై అభ్యర్థుల్లో అర్థమెటిక్,  ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ల్లో 113 మంది, సివిల్‌ ఎస్సై అభ్యర్థుల్లో జనరల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌లో 106 మంది, తెలుగు, ఉర్దూ సబ్జెక్ట్‌ల్లో 30 మంది అభ్యర్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. కానిస్టేబుల్‌ పోస్టుకు పోటీపడుతున్న అభ్యర్థుల్లో జనరల్‌ స్టడీస్‌ కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోరుతూ 844 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. అభ్యర్థులు వారివారి వ్యక్తిగత లాగిన్‌ ఐడీ ద్వారా రీకౌంటింగ్‌ ఫలితాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 

చదవండి: TSLPRB: ఒక పోస్టు.. 174 మంది పోటీ

ఎడిట్‌ ఆప్షన్లకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు ఫీజు 

బోర్డు అధికారులు ముందు నుంచి చెబుతున్నట్టుగానే దరఖాస్తు సమయంలో ఏవైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు ముందే ఎడిట్‌ ఆప్షన్‌ ఇస్తున్నారు. అయితే అందుకు అభ్యర్థులు ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థుల దరఖాస్తును ఏ–టైప్‌ (అభ్యర్థి పేరు, జెండర్, కులం, ఈడబ్ల్యూస్‌ కోటా, ఫొటో, సంతకం, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కోటాలోని వివిధ కేటగిరిల్లో వయస్సు మినహాయింపు), బి–టైప్‌ (అభ్యర్థి ఇంటిపేరు, ఆధార్‌ నంబర్, పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు, ఎస్‌ఎస్‌సీ రూల్‌ నంబర్, ఈ మెయిల్‌ ఐడీ, ఓబీసీ క్రిమిలేయర్‌/ నాన్‌ క్రిమిలేయర్, ఇంటి అడ్రస్, విద్యార్హతలు వంటివి)గా విభజించారు. దీనిలో ఏ టైప్‌ సమాచారంలో ఎడిట్‌ ఆప్షన్‌ పొందేందుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 3వేలు, ఇతర అభ్యర్థులు రూ.5వేలు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

చదవండి: TSLPRB: దళారులను నమ్మి మోసపోవద్దు

అదేవిధంగా బి–టైప్‌ వివరాల్లో ఎడిటింగ్‌ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు, ఇతర అభ్యర్థులు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రెండింటిలో ఎడిటింగ్‌ కోరే వారు రెండు రకాలకు ఫీజులు వేర్వేరుగా చెల్లించాలి. జూన్‌ 6 ఉదయం 8 గంటల నుంచి 8 రాత్రి 8 గంటల వరకు ఎడిట్‌ ఆప్షన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చైర్మన్‌ శ్రీనివాసరావు సూచించారు. ఇందులో ఏ–టైప్‌లోని వివరాలను టీఎస్‌ఎల్పీఆర్బీ , హైదరాబాద్‌ కార్యాలయంలోనే అధికారులు ఎడిట్‌ చేస్తారు. బి–టైప్‌లోని వివరాల ఎడిటింగ్‌ మాత్రం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో అభ్యర్థి సమక్షంలోనే ఆ జిల్లా ఎస్పీ లేదా కమిషనర్‌ సమక్షంలో చేస్తారు. ఎడిట్‌ ఆప్షన్‌ కోసం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన రిసిప్ట్‌ను అభ్యర్థులు విధిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎడిటింగ్‌ పూర్తయిన వెంటనే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తారు. ఎడిట్‌ ఆప్షన్‌కు ఇదే చివరి అవకాశం అని, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయితే మరోమారు ఎడిటింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, తగినన్ని పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.   

చదవండి: TSLPRB: చిన్న ఐడియా.. 670 కొలువులు!

Published date : 06 Jun 2023 02:44PM

Photo Stories