Inter Students: ఇంటర్ విద్యార్థుకు అందని పాఠ్య పుస్తకాలు
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయాలి
కళాశాలలు ప్రారంభించి నెలన్నర రోజులు కావొస్తున్నా ఇంతవరకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదు. దీంతో విద్యార్థులకు పాఠాలు సరిగా అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తి కావాల్సి ఉంది. అధికారులను అడిగితే ఇంకా ముద్రణ జరుగుతోందని వస్తాయని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను వెంటనే పంపిణీ చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
– ఎస్. భిక్షం, టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హుజూర్‌నగర్.
నెలాఖరు వరకు పంపిణీ చేస్తాం
ప్రభుత్వం నుంచి ఇంటర్ పాఠ్యపుస్తకాలు మన జిల్లాకు త్వరలోనే వస్తాయి. ఇప్పటికే పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ సరఫరా కాక జాప్యం జరిగింది. గత ఏడాది చదివిన విద్యార్థుల పుస్తకాలను కొందరికి అందజేశాం. జిల్లాకు వచ్చే పాఠ్యపుస్తకాలను కార్గో సర్వీసుల ద్వారా డైరెక్టుగా అన్ని కాలేజీలకు తక్షణం పంపిణీ చేసి నెలాఖరు వరకు విద్యార్థులకు అందజేస్తాం.
– జానపాటి కృష్ణయ్య, డీఐఈఓ, సూర్యాపేట
- ఇంటర్ విద్యార్థుకు అందని పాఠ్య పుస్తకాలు
- కళాశాలలు మొదలై 43 రోజులు
- చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
హుజూర్‌నగర్: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదు. కళాశాలలు ప్రారంభించి 43రోజులైనా పుస్తకాల ఊసే లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్‌లు కొనసాగుతున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జూలై ప్రారంభం నుంచి తరగతులు మొదలయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు పుస్తకాల సరఫరాలో కొంత ఆలస్యమైనా పర్వాలేదు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఇప్పటికే పాఠ్యపుస్తకాలను సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు రాలేదు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 40..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ ఆధీనంలోని జూనియర్ కళాశాలలు మొత్తం 40 వరకు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ కళాశాలలు 7 ఉన్నాయి. వివిధ సంక్షేమ, కేజీబీవీ, గురుకుల కాలేజీలు కలిపి 33 వరకు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 3,300 ఉండగా రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 2,800 మంది ఉన్నారు. అయితే ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు ఇంకా పూర్తి కానప్పటికీ ఇప్పటికే ప్రవేశాలు పొందిన వారికి పాఠాలు చెబుతున్నారు. అయితే ఆయా కళాశాలలకు ప్రభుత్వం నుంచి దాదాపు 3 వేల సెట్లకు పైగా పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. వాటిలో హెచ్‌ఈసీ, సీఈసీ వారికి 5 పుస్తకాల చొప్పున, ఎంపీసీ, బైపీసీ వారికి 6 ప్యాఠ్యపుస్తకాల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది.
పాతపుస్తకాలతో సరిపెడుతున్నారు..
ప్రభుత్వం నుంచి పాఠ్యపుస్తకాలు ఇంకా సరఫరా కాక పోవడంతో కొన్ని పాత పుస్తకాలతో నెట్టుకొస్తున్నారు. ఇలా అయితే తాము ఎలా చదువు కోవాలని ఇంటర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే పాఠ్యపుస్తకాల ముద్రణ జరిగి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను వెంటనే సరఫరా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.