Intermediate Exams 2024: రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ....
ఖమ్మం సహకార నగర్: విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి. వచ్చేనెల 19వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జిల్లాలో 70కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 36,578మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 18,481మంది, ద్వితీయ సంవత్సరం వారు 18,097మంది ఉన్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనుండగా, ఉదయం 8గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అలాగే, నిర్ణీత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
పకడ్బందీగా నిర్వహించేలా...
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం హైపవర్ కమిటీ(హెచ్‌సీపీ), జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ(డీఈసీ)లే కాక మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 10మందితో సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఇక ఒక్కో కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, అడిషినల్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఏడుగురు కస్టోడియన్ అధికారులను సైతం నియమించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడంలో కానీ పరీక్ష రాయడంలో కానీ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లుచేయాలని కలెక్టర్ గౌతమ్ ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు.
పోలీసుస్టేషన్లలో ప్రశ్నాపత్రాలు
ఇప్పటికే ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్ష ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరాయి. వీటిని కేంద్రాలకు సమీ పంలోని పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష జరిగే రోజు బందోబస్తు నడుమ అధికారులు కేంద్రానికి తీసుకెళ్లనున్నారు. కాగా, పరీక్షా కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు మోడల్ స్కూళ్లలోనే కాక నాలుగు ప్రభుత్వ హైస్కూళ్లు, రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు.
యాప్‌లో కేంద్రం, రూట్‌మ్యాప్
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఈసారి సాంకేతికత పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు టీఎస్‌బీఐఈ tsbie m services యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై సిటిజన్ అనే ఆప్షన్ వద్ద హాల్‌టికెట్ నంబర్ నమోదు చేస్తే పరీక్షా కేంద్రం వివరాలు, మ్యాప్‌ను చూపిస్తుంది. తద్వారా పరీక్షా కేంద్రాన్ని సులువుగా గుర్తించడమే కాక చేరుకునే వెసలుబాటు లభిస్తుంది.
Click the Link : BIE TS Inter Public Exams 2024 Hall tickets
వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు తీసుకోవచ్చు
ప్రైవేట్ కళాశాలల బాధ్యులు హాల్‌టికెట్ ఇవ్వకపోతే tsbie (telangana state borad of intermediate education) వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావొచ్చు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశాం. నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున విద్యార్థులు ముందురోజే పరీక్ష కేంద్రాలను సరిచూసుకుని సమయానికి హాజరుకావాలి.
– కె.రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి
Tags
- TS inter public exam
- inter public exam time table 2024 details
- TS Inter 1st Year Exam Dates 2024
- S Inter second Year Exam Dates 2024
- TS Inter Public Exams Time Table 2024
- sakshieducation latest news
- inter public exam
- Intermediate annual examinations
- District-wide exams
- Student level exams
- SakshiEducationUpdates