Inter Practical Exams: ముగిసిన ప్రాక్టికల్ పరీక్షలు
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ రెండోసంవత్సరం విద్యార్థుల ప్రయోగ పరీక్షలు గురువారం ముగిసినట్లు డీఐఈఓ మద్దిలేటి తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మొదటిదశ, 6 నుంచి 10వ తేదీ వరకు రెండో దశ, 11 నుంచి 15వ తేదీ వరకు మూడో దశ పరీక్షలు రెండు సెక్షన్లలో కొనసాగాయని వివరించారు. ఒకేషనల్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ప్రాక్టీకల్స్ ముగిసినట్లు వెల్లడించారు.
నేడు ఆంగ్లం ప్రాక్టికల్స్..
ఆంగ్లంపై పట్టు సాధించడానికి తొలిసారి ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ డీఐఈఓ మద్దిలేటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్ తరహాలోనే ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్ ఉంటుందని.. జిల్లావ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 5,423, ఒకేషనల్ విద్యార్థులు 1,123 మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు.
19న పర్యావరణ విద్యపై..
అదేవిధంగా ఈ నెల 19న ఫస్టియర్ విద్యార్థు లు పర్యావరణ విద్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. జనరల్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు, రాత పరీక్షకు 80 మార్కు లు, ఒకేషనల్‌లో ప్రాక్టికల్స్‌కు 10 మార్కులు, రాత పరీక్షకు 40 మార్కులు ఉంటాయన్నారు.
చదవండి: Intermediate: ఇంటర్‌లో ఆంగ్ల భాషా నైపుణ్యాలపై పరీక్ష
ఉపాధ్యాయుల సంఘీభావ ర్యాలీ
పెబ్బేరు రూరల్: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా గురువారం రాత్రి జిల్లాకేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్, డీటీఎఫ్ నాయకులు ఎస్‌ఎస్ రవిప్రసాద్‌గౌడ్, డి.కృష్ణయ్య, కె.ఏసోపు, మద్దిలేటి మాట్లాడుతూ.. రైతుల డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలని కోరారు. రైతులు, కూలీలు, కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని పెంచాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపాలని కోరారు. బి.వెంకటేష్, బి.శ్రీనివాసులు, శాంతన్న, చిరంజీవి, బి.నరేందర్, మురళి, లక్ష్మణ్‌గౌడ్, వెంకటేష్, ఐ.నారాయణ, శివారెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా కబడ్డీ జట్టు
ఆత్మకూర్: సూర్యాపేట జిల్లా చింతపాడు మండలం మల్లారెడ్డిగూడెంలో జరిగే రాష్ట్రస్థాయి 33వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు వనపర్తి జిల్లా జట్టు గురువారం తరలి వెళ్లిందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి డా. రాములు తెలిపారు. మండలంలోని మూలమళ్లలో ఉన్న దేశాయి సరళాదేవి లక్ష్మారెడ్డి క్రీడాప్రాంగణంలో అయిదు రోజులుగా క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ పొందారని వివరించారు. శుక్రవారం నుంచి 19వ తేదీ పోటీలు కొనసాగుతాయని చెప్పారు. సీనియర్ క్రీడాకారులు వెంకట్రాములు, ఖాజాపాషా, ఎల్లప్ప, శ్రీను, అశోక్ పాల్గొన్నారు.