Education News:ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల కోలాహలం ప్రారంభమైంది. గురువారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తెప్పించారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి. దీంతో స్వల్ప సంఖ్యలో కాలేజీలు సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తే.. వాటికి పరీక్ష కేంద్రాలు ఇవ్వబోమని బోర్డు అధికారులు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే అగ్నిమాపక శాఖ అనుమతి లేని బహుళ అంతస్తుల భవనాల్లోని కాలేజీలకు ఇంటర్ బోర్డు చివరి నిమిషం వరకు అనుమతివ్వలేదు. ఆఖరులో పెద్ద మొత్తంలో జరిమానా విధించి అనుమతిచ్చిది. ఆ కాలేజీల్లో చదివే విద్యార్థుల అడ్మిషన్లకు రూ.2,500, పరీక్ష ఫీజు రూ.500 వసూలు చేసింది. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు వేధిస్తున్నారని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సీఎంకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ప్రైవేటు కాలేజీలు ఎంతవరకు సహకరిస్తాయనేది అనుమానంగా మారింది.
కొన్ని కాలేజీలపై నిఘా: పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రభుత్వం ఇంటర్ బోర్డును ఆదేశించింది. పరీక్షలపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించింది. దీంతో కొన్ని ప్రైవేటు కాలేజీలపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి పెట్టాయి. ప్రశ్న పత్రాల బట్వాడా నుంచి, సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు చేరవేసే దాకా వీడియో రికార్డింగ్ ఉండాలని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులను ఆదేశించింది. ఇంటర్ పరీక్షల నియంత్రణ అధికారి జయప్రదబాయి గురువారం కొన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
మొదలైన ప్రాక్టికల్స్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 3 నుంచి సెకండియర్ సైన్స్, మ్యాథమెటిక్స్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. థియరీ పరీక్షలు మార్చి 5 నుంచి మొదలవుతాయి. మొదటి సంవత్సరంలో 4,88,316మంది, రెండో సంవత్సరంలో 5,08,225 మంది కలిపి మొత్తం 9,96,541 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. థియరీ పరీక్షల హాల్ టిక్కెట్లు రెండు రోజుల్లో అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. ప్రాక్టికల్స్ కోసం 2,008, థియరీ కోసం 1,532 కేంద్రాలను ఏర్పాటుచేశారు.
ఇదీ చదవండి: Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం
మాపై నియంత్రణ దేనికి?
పరీక్షలకు మేం సహకరిస్తామనే చెబుతున్నాం. కానీ ఇంటర్ బోర్డు అధికారులు ప్రైవేటు కాలేజీలపై కక్ష గట్టినట్టు వ్యవహరిస్తున్నారు. సమస్య సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టాలనే ఆదేశం సరైంది కాదు.
– గౌరీ సతీష్, ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
అన్ని చర్యలు తీసుకున్నాం
ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. పరీక్షల విధానాన్ని మొత్తం రికార్డు చేస్తున్నాం. ప్రైవేటు కాలేజీలు కూడా సహకరించాలి. – జయప్రదబాయి, ఇంటర్ పరీక్ష విభాగం ముఖ్య అధికారి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Board of Intermediate Education
- Telangana State Board of Intermediate Education
- telangana intermediate board
- CCTV Cameras
- Telangana Inter board cctv cameras
- Education News
- Sakshi Education News
- intermediate practical exams
- Inter Practical Exams
- Installation of CCTV cameras in the centers of inter-board practical examinations
- ExamCenterSecurity