Skip to main content

TSBIE: అడ్డగోలు అడ్మిషన్లు చెల్లవ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కాలేజీలపై ఇంటర్‌ బోర్డు మరింత దృష్టి పెట్టింది. అనుమతుల్లేకుండా అడ్డగోలుగా చేపట్టే అడ్మిషన్లు చెల్లవని స్పష్టంచేసింది.
TSBIE
అడ్డగోలు అడ్మిషన్లు చెల్లవ్‌

అలాంటి కాలేజీల వివరాలు సేకరించి తమకు పంపాలని జిల్లా ఇంటర్‌ అధికారులను ఆదేశించింది. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. దీంతోపాటు 2023లో సకాలంలో అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈలోగా ఎక్కడా ఏ కాలేజీ అడ్మిషన్లు తీసుకోవడానికి వీల్లేదని, కాలేజీకి గుర్తింపు రాకపోతే బోర్డు బాధ్యత వహించదని స్పష్టంచేసింది. ప్రతీ ప్రైవేటు కాలేజీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను పొందుపరుస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఏటా బోర్డు నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై గట్టి నిఘా ఉంచాలని, వాటి వివరాలను తమకు పంపాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. 

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

మెరుగైన బోధన ఉండాల్సిందే..

ఎక్కడైతే అనుబంధ గుర్తింపు పొందుతారో, అక్కడే కాలేజీ నిర్వహించాలని, ఒకచోట అనుమతి, వేరొకచోట కాలేజీ ఉంటే పర్మిషన్‌ రద్దు చేస్తామని ప్రైవేటు ఇంటర్‌ కాలేజీలను బోర్డు హెచ్చరించింది. ఈ దిశగా వివరాలు సేకరించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన బోధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది ఒక క్యాంపస్‌కే పరిమితం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేటప్పుడు వారి వివరాలను ఈ ఏడాది నుంచి బోర్డు ఆన్‌లైన్‌లో నమోదు చేయబోతోంది. విద్యాసంవత్సరం మొదట్లో నియమించిన అధ్యాపకులే చివరి వరకూ ఉండాలనే నిబంధన విధించింది. ఒకవేళ అధ్యాపకుడిని మారిస్తే ఆ విషయాన్ని బోర్డు అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల బోధన ఏ స్థాయిలో జరుగుతుందనేది అంచనా వేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

బయోమెట్రిక్‌ తప్పనిసరి

ఈ ఏడాది నుంచి సిబ్బంది బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయనున్నారు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో బోధించే అధ్యాపకులు విధిగా పీజీ చేసి ఉండాలి. వారి వివరాలు, ఆధార్, బయోమెట్రిక్‌కు అవసరమైన వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా ఫీడ్‌ చేస్తారు. విద్యా సంవత్సరం ముగిసే వరకూ వారి బయోమెట్రిక్‌ కొనసాగేలా చూస్తారు. ప్రతీ కాలేజీలో ప్రత్యేక మొబైల్‌ నంబర్‌ అందుబాటులో ఉండాలని, ఇది జిల్లా ఇంటర్‌ విద్యాధికారికి తెలపాలని సూచించారు. విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్ణయించిన తేదీల్లోనే ప్రవేశాలు, తరగతులు జరగాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 

Published date : 04 May 2023 02:53PM

Photo Stories