Skip to main content

Tenth Class: ఈ ఉద్యోగుల అలసత్వమే.. జవాబు పత్రాల బండిల్‌ మిస్సింగ్‌కు కారణం..

సాక్షి, ఆదిలాబాద్‌/ఉట్నూర్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో పదో తరగతి జవాబు పత్రాల బండిల్‌ మిస్సింగ్‌ కేసులో పోస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కనిపిస్తోంది.
Tenth Class
టెన్త్‌ జవాబు పత్రాలతో వెళ్తున్న ఆటోకు సంబంధించిన సీసీటీవీ దృశ్యం

ఏప్రిల్‌ 3న ప్రథమ భాష పరీక్ష తర్వాత జవాబు పత్రాలను పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు ఉట్నూర్‌ పోస్టాఫీసుకు అందించారు. ఇక్కడ బండిళ్లను తయారు చేసి బస్సు ద్వారా వరంగల్‌కు పంపించాలి. పోస్టాఫీస్‌ నుంచి ఆటోలో సిబ్బంది ఎంటీఎస్, ఈడీ ప్యాకర్‌ వెంటఉండి వాటిని బస్టాండ్‌కు తరలించాలి. అయితే ఈ సిబ్బంది ఎవరూ వెంట లేకుండానే ఆటోలో వేసి వారు తమ ద్విచక్ర వాహనం ద్వారా వెళ్లారు. బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత 11 బండిల్స్‌ (కట్ట) నుంచి ఒకటి మిస్‌ అయ్యింది. పోస్టుమాస్టర్‌ ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌ 3 సాయంత్రం ఉట్నూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని పేపర్‌ బండిల్‌ కోసం వెతికినప్పటికీ దొరకలేదు. ఏప్రిల్‌ 4 ఉదయం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్, డీఈవో ప్రణీత ఉట్నూర్‌ చేరుకున్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

మొదట పోస్టాఫీసుకు వెళ్లగా సెలవు కారణంగా వారు అందుబాటులో లేరు. దీంతో వీరు స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని డీఎస్పీ నాగేందర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న అధికారులు పూర్తి విషయాలపై ఆరా తీశారు. కాగా, నిజామాబాద్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఉమామహేశ్వర్‌రావు ఉట్నూర్‌ చేరుకొని బండిల్‌ మిస్సింగ్‌ విషయంలో విచారించారు. ఇదిలా ఉంటే పోలీసులు పోస్టల్‌ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు ఆటో వెళ్లిన దారిలో రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పేపర్‌ బండిల్‌ దొరకలేదు. పరీక్ష రాసిన 9 మంది విద్యార్థుల జవాబు పత్రాల బండిల్‌ మిస్సింగ్‌తో ఆ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 

ఇద్దరిపై వేటు 

టెన్త్‌ జవాబు పత్రాల బండిల్‌ మిస్సింగ్‌ ఘటనలో పోస్టాఫీస్‌ ఉద్యోగి ఎంటీఎస్‌ రజితపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురికాగా ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ కు తరలించారు. మరో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నాగరాజును బాధ్యతల నుంచి తప్పించారు.

Published date : 05 Apr 2023 12:53PM

Photo Stories