Skip to main content

Hanmajipalle Primary School: టైంకు వస్తలేరు.. చదువు చెప్తలేరు

గన్నేరువరం: ‘సర్‌ మా ఊరి సర్కారు బడిని గతంలో మూతబడితే చందాలు వేసుకుని మళ్లీ ప్రారంభించాం. మన ఊరు– మన బడి కింద ప్రభుత్వం ఆధునీకరించింది.
Govt School Teachers

అయితే ఇక్కడి పిల్లలకు చదువుచెప్పే సార్లు మాత్రం టైంకు బడికి వస్తలేరు. వచ్చినోళ్లు చదువు చెప్తలేరు. బడికొచ్చిన పిల్లలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయమై చాలాసార్లు మాజీ సర్పంచ్‌కి, పెద్దసార్లకు ఫిర్యాదు చేసినం. ఎవరూ మారలేదు.

మీరైనా బడిలోని సార్లను బాగుచేయండి’ అంటూ గన్నేరువరం మండలం హన్మాజిపల్లె ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవోకు మొర పెట్టుకున్నారు. డీఈవో జనార్దన్‌రావు మార్చి 28న‌ పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో హెచ్‌ఎం భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయుడు రవీందర్‌రావు విధుల్లో ఉండగా ఒకరు లీవ్‌లో, మరొకరు పదోతరగతి పరీక్షల విధులకు వెళ్లారు.

చదవండి: Healthy Food: విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి

ఈ సందర్భంగా డీఈవో విద్యార్థులతో మాట్లాడగా.. తమకు చదువు సరిగా చెప్పడం లేదని, అసభ్యకరమైన పదాలతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డీఈవో వచ్చిన విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. ఇక్కడి ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని, దీంతో విద్యార్థులు సరిగా చదవడం లేదని డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అనేక సందర్భాల్లో జంగపల్లి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, మాజీ సర్పంచ్‌కు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదన్నారు.

గతంలో మూతబడిన బడిని 2015లో చందాలు వేసుకుని ప్రారంభించామని, మళ్లీ ఆ పరిస్థితి రానియొద్దని, హెచ్‌ఎం భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయుడు రవీందర్‌రావును ఇక్కడి నుంచి బదిలీ చేయాలని విన్నవించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని డీఈవో హామీ ఇచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.

చదవండి: DSC: ఓపెన్‌ స్కూల్‌ చదివితే డీఎస్సీకి చాన్స్‌ లేనట్టే

ఉపాధ్యాయురాలి సస్పెన్షన్‌

కరీంనగర్‌: హన్మాజిపల్లె ఎంపీపీఎస్‌ ఉపాధ్యాయురాలు డి.భాగ్యలక్ష్మిని సస్పెండ్‌ చేసినట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. ఆమె విధులకు గైర్హాజరవుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎంపీపీ ఫిర్యాదు చేశారన్నారు. మార్చి 28న‌ పాఠశాలను సందర్శించగా నిజమేనని తేలిందన్నారు. దీంతో ఆమెను సస్పెండ్‌ చేశామని, ఇదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వచ్చినందున నోటీసులు అందించినట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

Published date : 29 Mar 2024 03:48PM

Photo Stories