Tenth Class Exams 2024: పదో తరగతి పరీక్షలకు మరో 45 రోజులు... విద్యార్థులు సొంతంగా ఆలోచించి, నిరంతర సాధన చేయండి!
గద్వాల: ఎస్సెస్సీ పరీక్షలకు మరో 45 రోజుల కాలం మిగిలి ఉందని.. పరీక్షలలో విద్యార్థులు విజయం సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి నిలపాలని.. ఎస్సెస్సీలో ఏ ఒక్క విద్యార్థి అనుత్తీర్ణత కాకుండా వారిని పరీక్షలకు సన్నద్దం చేయాలని అడిషనల్ కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బాలభవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహ పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణా తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి పదికి పది జీపీఏ సాధించాలని సూచించారు. వసతిగృహాల్లో చదివే విద్యార్థులందరూ నిరుపేద కుటుంబాల పిల్లలే ఉంటారని, వీరికి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందన్నారు.
Also Read : పరీక్ష హాల్‌లో ఒత్తిడికి గురికావొద్దు... ఈ చిట్కాలు పాటించి ఒత్తిడిని జయించండి!
ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే చదువు అన్నింటికి మూలమన్నారు. అనంతరం ప్రముఖ సైకాలజిస్టు లక్ష్మణ్ మాట్లాడుతూ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే దానిపై వివరించారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. సొంతంగా ఆలోచించడం, నిరంతర సాధన చేయడం విద్యార్థులు మరువరాదన్నారు. కార్యక్రమంలో సంక్షేమశాఖల జిల్లా అధికారులు శ్వేతప్రియదర్శిణి, సరోజ, ప్రవీల, సుజాత, సుధీర్, శేఖర్, జయరాం, హాస్టళ్ల విద్యార్థులు పాల్గొన్నారు.