Tenth Class Public Exams 2024: పదవతరగతి ఇంటర్నల్ మార్కుల తనిఖీ
చిలుకూరు: పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈనేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల నమోదు పరిశీలనకు శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇంటర్నల్ మార్కులు వేసే విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవాలు పరిశీలించడానికే..
ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ఉండగా 80 మార్కులకు వార్షిక పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు నాలుగు ఫార్మెటివ్ అసెన్‌మెంట్ ఫలితాలు , విద్యార్థులు రాసే రికార్డుల ఆధారంగా మార్కుల కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌లో వాస్తవంగా మార్కులు వేశారా లేదా అన్న విషయాన్ని ఈ బృందాలు పరిశీలించనున్నాయి. లోపాలుంటే సరిచేసిన తర్వాతే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
Also Read: Biology Bit Bank
ఒక్కో బృందానికి 5నుంచి 7 పాఠశాలలు
జిల్లాలో జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు 184, ప్రైవేట్ పాఠశాలలు 121, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు 50 ఇలా మొత్తం 355 పాఠశాలల్లో 11,946 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. పాఠశాలలను తనిఖీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 30 ప్రత్యేక బృందాలను జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో జీహెచ్‌ఎమ్ గానీ, ఎఫ్‌ఏసీ ప్రధానోపాధ్యాయుడు గానీ, ఒక లాంగ్వేజ్ పండిట్, మరో నాన్ లాంగ్వేజ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ ఉంటారు. ఒక్కో బృందానికి 5 నుంచి 7 పాఠశాలల తనిఖీ బాధ్యతలను అప్పగించారు. మార్చి మొదటి వారంలో ప్రీఫైనల్ పరీక్షలు ఉన్నందున ఈ నెల 21వ తేదీలోపు ఈ తనిఖీ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇంటర్నల్ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.