NIT Ranker: ఎంబీబీఎస్ కోసం నిట్‌లో పై చేయి సాధించిన విద్యార్థిని..
మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో పంక్చర్ దుకాణం నడుపుతున్న అన్వర్ ఖాన్ కుమార్తె మిస్బాహ్ NEET UG పరీక్ష క్రాక్ చేసి కుటుంబంలో అవధులు లేని ఆనందాన్ని నింపింది. మిస్బాహ్ నీట్ పరీక్షలో 720 మార్కులకు 633 స్కోర్‌తో విజయం సాధించింది. ఈ విషయం తెలియగానే జాల్నా పట్టణంలోని వారంతా ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.
మిస్బాహ్ ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. తండ్రి అన్వర్ ఖాన్ మోటార్‌సైకిళ్లకు పంక్చర్లు వేస్తూ, కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటి పరిస్థితులు బాగోలేకపోయినా తనకుమార్తె ఎంతో శ్రమించి, రెండవ ప్రయత్నంలో నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని అన్నారు. ఇప్పుడు తన కుమార్తె ఎంబీబీఎస్ చేయాలనే కలను సాకారం చేసుకుంటున్నదన్నారు.
నీట్ పరీక్షలో తమ కుమార్తె విజయం సాధించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సందర్భంగా తండ్రి అన్వర్ ఖాన్ మాట్లాడుతూ ‘ఒకవేళ అంకుశ్ సార్ మార్గదర్శకత్వం లేకుంటే మిస్బాహ్ ఈ విజయాన్ని సాధించలేకపోయేది. గడచిన రెండు మూడేళ్లుగా తన కుమార్తె పట్టణంలోని అంకుశ్ సార్ దగ్గర ఉచితంగా నీట్ క్లాసులకు హాజరవుతోంది. దీనికితోడు ఎంతో కష్టపడి చదవడంతో తన కుమార్తె పట్టణం నుంచి నీట్ పరీక్షలో టాపర్‌గా నిలిచిందని’ అన్నారు.
జాల్నాలో నీట్ పరీక్షకు శిక్షణ అందిస్తున్న అంకుశ్ సార్ మీడియాతో మాట్లాడుతూ ‘ మేము విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నాం. దీనిలో మిస్బాహ్ ఉచిత కోచింగ్ తీసుకుంది. ఇప్పుడు మా కృషికి తగిన ఫలితం దక్కినట్లు అనిపించింది’ అని అన్నారు.
మిస్బాహ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇంటిలోని ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అయినా పగలనక, రాత్రనక కష్టపడి చదివాను. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా పేదలకు వైద్య సేవలు అందిస్తాను’ అని తెలిపింది.