Inspiring Success of Youth: నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన ఈ యువకులు
సివిల్ ఎస్సైగా తేజేశ్వర్‌రెడ్డి
బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన మేడం తేజేశ్వర్‌రెడ్డి సివిల్ ఎస్సైగా ఎంపికయ్యారు. తండ్రి తిరుపాల్‌రెడ్డి చిన్నతనంలోనే మృతి చెందగా, తల్లి కళావతి కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసి పిల్లల్ని చదివించింది. తల్లి కష్టాన్ని చిన్నతనంలోనే గుర్తించిన తేజేశ్వర్‌రెడ్డి పట్టుదలతో చదివి బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం నాలుగేళ్లుగా రాజస్థాన్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై ఉన్న మక్కువతో ఎస్సై పరీక్షలు రాసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు.
ఎస్‌ఐగా ఏఆర్ కానిస్టేబుల్..
సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామానికి చెందిన పాలకిట్టి హనుమంతరావు, సీతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. హనుమంతరావు స్థానిక రైస్‌మిల్లులో హమాలి పనిచేస్తున్నాడు. పెద్దకుమారుడు వినోద్‌కుమార్ ఐదేళ్ల క్రితం ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ఎస్సై పరీక్ష ఆయన ఫైర్ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు.
సీతంపేటలో హరికృష్ణ
సీతంపేట బంజర గ్రామానికి చెందిన బాదావత్ చందర్, బిక్కీ దంపతులకు ముగ్గురు కుమారుల సంతానం. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రెండో కుమారుడు హరికృష్ణ ఇటీవల ఎస్సై పరీక్షలు రాశాడు. మూడు నెలల క్రితం రైల్వే డిపార్టుమెంట్‌లో ఉద్యోగంలో చేరిన హరికృష్ణ తాజాగా ఎస్సై ఉద్యోగం సాధించాడు.
ములకలపల్లిలో నవిత
ములకలపల్లి మండలానికి చెందిన యువతి సాయిన్ని నవిత సివిల్ ఎస్సై పోస్టుకు ఎంపికైంది. సూరంపాలెం గ్రామానికి చెందిన సాయిన్ని రమణారావు, దుర్గమ్మ దంపతుల కూతురు నవిత తొలిప్రయత్నంలో విజయం సాధించింది. తల్లిదండ్రులతోపాటు మేనమామ అనుమల సత్యనారాయణ ప్రోత్సాహంతో విజేతగా నిలిచినట్లు నవిత తెలిపింది.