Study Abroad: 2021–22లో ఉన్నత విద్య కోసం అమెరికాకు అత్యధికంగా విద్యార్థులు వెళ్లిన దేశాలు ఇవే..
ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులే అత్యధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలల దృష్టి మరింత మంది భారతీయ విద్యార్థులను చేర్చుకోవడంపైనే ఉంది. ఇప్పటివరకు చైనా విద్యార్థులు అధిక సంఖ్యలో యూఎస్లో చదువుతుండగా 2023–24 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) పరిశీలనలో వెల్లడైంది.
అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), గ్రాడ్యుయేషన్ కోర్సులు రెండింటిలోనూ భారతీయ విద్యార్థులను ఆకర్షించడమే యూఎస్ యూనివర్సిటీలు/కళాశాలల తొలి ప్రాధాన్యంగా ఉండటం విశేషం. యూఎస్ కళాశాలలు 2023–24లో అండర్ గ్రాడ్యుయేషన్లో 57 శాతం, గ్రాడ్యుయేషన్లో 77 శాతం మంది భారతీయ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 2022లో మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్లకు వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో భారతీయ విద్యార్థులు ఏకంగా 38 శాతం మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ విద్యా సంస్థలకు భారత్ అతిపెద్ద మార్కెట్గా నిలుస్తోంది.
చదవండి: Changes in TOEFL: టోఫెల్.. కీలక మార్పులు ఇవే!
పెరిగిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య
కాగా ఈ ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులు భారీగా పెరిగినట్టు అమెరికా వర్సిటీలు తెలిపాయి. కరోనా తర్వాత 2021–22లో యూఎస్ ఉన్నత విద్యలో తొలిసారి కొత్తగా చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 80 శాతం పెరగడం విశేషం. ఈ వృద్ధి ఇంకా వేగంగా కొనసాగుతోంది. ఎక్కువ అమెరికన్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు (61 శాతం) గతేడాది కంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో అత్యధికంగా దరఖాస్తులు స్వీకరించినట్టు పేర్కొన్నాయి. 28 శాతం విద్యా సంస్థలు తమ అడ్మిషన్లు స్థిరత్వంగా ఉన్నాయని వెల్లడించాయి.
12 శాతం సంస్థలు ఎన్రోల్మెంట్ తగ్గినట్టు తెలిపాయి. కౌన్సిల్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్కూల్స్ ప్రకారం.. మాస్టర్స్ ప్రోగ్రామ్లకు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా 2021–22లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు 33.8 బిలియన్ డాలర్లు సమకూరాయి. అయితే ఇది 2018 (45 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే తక్కువ.
చదవండి: Foreign Education : ఇక్కడ సీటొస్తే చాలు.. ఎంచక్కా..విదేశాల్లో చదవొచ్చు ఇలా..
2021–22లో ఉన్నత విద్య కోసం అమెరికాకు అత్యధికంగా విద్యార్థులు వెళ్లిన దేశాలు..
- చైనా
- భారత్
- దక్షిణ కొరియా
- కెనడా
- వియత్నాం
- తైవాన్
- సౌదీ అరేబియా
- బ్రెజిల్
- మెక్సికో
- నైజీరియా
పడిపోయిన సౌదీ అరేబియా
భారత్ తర్వాత అత్యధికంగా అమెరికా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో చేరుతున్నవారిలో వరుసగా వియత్నాం (48 శాతం), దక్షిణ కొరియా (41 శాతం), బ్రెజిల్ (40 శాతం), చైనా (39 శాతం) ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరుతున్నవారిలో భారత్ తర్వాత చైనా (42 శాత), నైజీరియా (37 శాతం), వియత్నాం (35 శాతం), దక్షిణ కొరియా (34 శాతం), బ్రెజిల్ (34 శాతం) దేశాలు చోటు దక్కించుకుంటున్నాయి.
అలాగే నేపాల్, బంగ్లాదేశ్, కెనడా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశాల్లో మూడో వంతు కంటే ఎక్కువ కళాశాలలు భారత్ను అగ్ర మార్కెట్గా పేర్కొంటున్నాయి. విద్యార్థుల చేరికల పరంగా 2021–22లో సౌదీ అరేబియా 7వ స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పుడు దానికి టాప్ 10లో స్థానం దక్కలేదు. ఇక నేపాల్ నుంచి 2021–22లో 12 శాతం, బంగ్లాదేశ్ నుంచి 13 శాతం విద్యార్థుల పెరుగుదల నమోదైంది.
చైనా విద్యార్థులకు సన్నగిల్లుతున్న ఆసక్తి..
2021–22లో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అత్యధికంగా చైనా నుంచి ఎక్కువ మంది వెళ్లారు. ఆ ఏడాది మొత్తం చైనా విద్యార్థుల వాటా 30.5 శాతంగా ఉంది. అయితే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 8.6 శాతం తగ్గడం గమనార్హం. దీనికి పూర్తి భిన్నంగా అదే ఏడాది భారతీయ విద్యార్థుల ఎన్రోల్మెంట్లు 18.9 శాతం పెరిగాయి. వచ్చే రెండేళ్లలో యూఎస్లో భారతీయ విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని ఐఐఈ అంచనా వేస్తోంది. మరోవైపు గత నాలుగేళ్లుగా చైనా విద్యార్థులకు అమెరికా చదువులపై ఆసక్తి సన్నగిల్లుతోందని పేర్కొంది.