Global Graduates from AP: ఏపీ నుంచే ‘గ్లోబల్ గ్రాడ్యుయేట్స్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ‘గ్లోబల్ గ్రాడ్యుయేట్స్’ను తయారు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో ర్యాంకులు సాధించిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ దూరదృష్టితో పేదింటి పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారన్నారు.
చదవండి: కష్టాల్లో IT sector: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక
విద్యారంగం మెరుగైన అభివృద్ధికి తమ ప్రభుత్వం నిపుణులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి(ఆస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ద్వారా ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైస్ చైర్మన్‌లు ప్రొఫెసర్ రామమోహనరావు, ప్రొఫెసర్ పి.ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. ఏపీలోని విద్యా రంగంలో సంస్కరణలకు నిదర్శనంగా ర్యాంకులు మెరుగుపడ్డాయన్నారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
అనంతరం న్యాక్ ఏ గ్రేడ్ 39, న్యాక్ ఏ ప్లస్ 32, న్యాక్ ఏ ప్లస్‌ప్లస్‌లో 6, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో ఓవరాల్, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, ఫార్మా విభాగంలో ర్యాంకులు సాధించిన 12 సంస్థల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. జేఎన్‌టీయూ కాకినాడ వైస్ చాన్స్‌లర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, విక్రమ సింహపురి వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎం సుందరవల్లీ, శ్రీ వెంకటేశ్వర వర్సిటీ రిజిస్ట్రార్ మహ్మద్ హుస్సేన్, ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.