Skip to main content

నేటి నుంచి ‘ఇంటర్ విద్యార్థులకు’ వీడియో పాఠాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు వీడియో పాఠాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
కోవిడ్-19 కారణంగా విద్యాభ్యాసానికి దూరమైన ఇంటర్ విద్యార్థుల కోసం అనుభవజ్ఞులైన అధ్యాపకులతో రూపొందించిన వీడియో పాఠాలను అందిస్తున్నారు. మంగళవారం నుంచి పరీక్షలు ముగిసే వరకూ నిరంతరం ఈ వీడియో పాఠ్యాంశాలు జియో టీవీ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ద్వారా కూడా వీటిని వీక్షించొచ్చు. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం తరగతుల పాఠ్యాంశాలు ప్రసారమవుతాయి. త్వరలోనే జూనియర్ ఇంటర్, జేఈఈ, ఎంసెట్, నీట్‌కు సంబంధించిన అంశాలను ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠ్యాంశాలకు సంబంధించిన టైమ్‌టేబుల్ వివరాలను ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్లో చూడవచ్చని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అటెండెన్స్ మినహాయింపునకు ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 18
మార్చి-2021 పరీక్షలకు హాజరయ్యే హ్యుమానిటీస్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రయివేటు విద్యార్థులు (కాలేజీ చదవని) అటెండెన్స్ నుంచి మినహాయింపునకు డిసెంబర్18వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి తెలిపారు. ఆలస్య రుసుం రూ.200తో ఈ నెల 24 వరకూ చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Published date : 08 Dec 2020 04:21PM

Photo Stories