Skip to main content

నైపుణ్యంతోపాటు ఉద్యోగావకాశాలు కూడా...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలు కల్పించి నేరుగా ఉద్యోగాలు ఇవ్వాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) పనిచేస్తోందని ఆ సంస్థ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.
చిత్తూరు జిల్లా శ్రీసిటీలో న్యాప్స్ ప్రోగ్రామ్ శిక్షణ పూర్తి చేసుకున్న 27 మంది గురువారం చెన్నైలోని జేబీఎం ప్లాంట్‌లో ఉద్యోగాల్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. శ్రీకాంత్ నేతృత్వంలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ బృందం చెన్నైలోని జేబీఎం కంపెనీతోపాటు ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆటోబాడీ రిపేర్, ఆటోమొబైల్ టెక్నాలజీ, క్వాలిటీ అండ్ ట్రైనింగ్ తదితర రంగాల్లో అవసరమైన మ్యాన్ పవర్‌ను తీసుకునేందుకు జేబీఎం ముందుకు వచ్చిందన్నారు. అంతేకాకుండా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారితోపాటు నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులను సప్లై చైన్ విభాగాల్లో తీసుకునేందుకు అంగీకరించిందని తెలిపారు. విశాఖపట్నంలో ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఏర్పాటుచేసి త్రీడీ యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీ, ఫిల్మ్ మేకింగ్,ప్రింట్ మీడియా టెక్నాలజీ తదితర విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికిఇదివరకే ఒప్పందం చేసుకుందన్నారు.
Published date : 11 Dec 2020 03:06PM

Photo Stories