కృత్రిమ మేధస్సు సాయంతో ఆవిష్కరణలు: మంత్రి కేటీఆర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (ఏఐ) సహా అత్యాధునిక ఐటీ సాంకేతికత (ఎమర్జింగ్ టెక్నాలజీ)లో ప్రపంచ స్థాయిలో గుర్తింపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీ4ఐఆర్), వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ (ఏఐ4ఏఐ) వర్చువల్ సదస్సులో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2020ని కృత్రిమ మేధో సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఐటీ పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు, పౌర సమాజం భాగస్వామ్యంతో ఏఐ ద్వారా ఆవిష్కరణల కోసం బహుముఖ వ్యూహం రూపొందించామని తెలిపారు. ఏఐ ద్వారా సమాజానికి అవసరమయ్యే ఆవిష్కరణల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు నాస్కామ్ భాగస్వామ్యంతో తెలంగాణ ఏఐ మిషన్ (టీ-ఎయిమ్)ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, డిజిటల్ టెక్నాలజీ ద్వారా మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
Published date : 13 Aug 2020 03:15PM