Skip to main content

1 నుంచి 8 తరగతులకు ఆన్‌లైన్ పాఠాలే.. ప్రత్యక్ష బోధనలేనట్టే!!

సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ఉంటుందా? ఉండదా? అంటే ఉండకపోవచ్చుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు.. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే ఎదురయ్యే సవాళ్లు, సమస్యల నేపథ్యంలో వారికి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు వెనుకంజ వేస్తోంది.

ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రారంభించిన ప్రత్యక్ష బోధనను మాత్రమే కొనసాగించే యోచనలో ఉంది. ఇటు మిగతా తరగతుల విద్యార్థులను ప్రస్తుతమున్న ఆన్‌లైన్/డిజిటల్ (టీవీ పాఠాలు) పాఠాలకే పరిమితం చేసే ఆలోచనల్లోనే విద్యాశాఖ ఉంది. అంతేకాదు వారికి బోర్డు ఎగ్జామ్స్ కాదు కాబట్టి ఎలాంటి పరీక్షల నిర్వహణ లేకుండానే పైతరగతులకు పంపించే దిశగానే అడుగులు వేస్తోంది.

భౌతిక దూరంకష్టమనే..
కరోనా కారణంగా పాఠశాల విద్య అస్తవ్యస్తంగా తయారైంది. కార్పొరేట్, బడా ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఫీజులు తీసుకున్నా, గ్రామీణ ప్రాంతాల్లోని, చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలు అటు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించలేకపోవడంతో అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. కొన్ని యాజమాన్యాలైతే స్కూళ్లను పూర్తిగా మూసేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు త్వం గత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్/డిజిటల్ (టీవీ పాఠాలను) ప్రారంభించింది. టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా వీడియో పాఠాలను ప్రభుత్వ విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆన్‌లైన్ బోధన చేపట్టలేని మరికొన్ని సాధారణ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం అందిస్తున్న వీడియో పాఠాలనే చూడా లని తల్లిదండ్రులకు సూచించాయి. మొన్నటివరకు అ లాంటి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వీడియో పాఠాలనే విన్నారు. చివరకు ఈనెల 1వ తేదీ నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం ప్రారంభించింది. పాఠశాలల్లో భౌతిక దూరం పాటిస్తూ, బెంచీకి ఒకరు చొప్పున, తరగతి గదిలో 20 మంది మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. గతంలో ఒక్కో తరగతికి చెందిన వారు ఒకే గదిలో 70-80 మంది కూర్చునే విద్యార్థులను మూడు నాలుగు తరగతి గదుల్లో కూర్చోబెట్టారు. వారికి బోధించేందుకు ఉన్నత పాఠశాలల్లోని టీచర్లతో పాటు 5 వేల మంది వరకు ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై ఉన్నత పాఠశాలలకు పంపించారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం బెంచీకి ముగ్గురు నలుగురు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. భౌతిక దూరం పాటించడం అనేది లేకుండా పోయింది.

6, 7, 8 తరగతులు ప్రారంభించాలనుకున్నా..
పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించిన సమయంలోనే 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనే ఆలోచన చేశారు. అయితే 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన సమయంలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చూసి నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే పాఠశాలల్లో కరోనా వ్యాప్తి లేకపోయినా, ప్రైవేటు పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రత్యక్ష బోధన ప్రారంభమై 18 రోజులు దాటింది. అయితే కోవిడ్ నిబంధనల అమలు ప్రైవేటు పాఠశాలల్లో పక్కాగా సాధ్యం కావడం లేదనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ పరిస్థితుల్లో 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే, ఏదైనా అనుకోని సమస్య వస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఒక్క విద్యార్థికి కరోనా ఉన్నా అది ఇతరులకు సులభంగా సోకే ప్రమాదముంది. పైగా ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం 6, 7, 8 తరగతులను ప్రారంభిస్తే ఇంకా అదనపు టీచర్లు కావాలి.. గత విద్యా సంవత్సరంలో తీసుకున్న 12 వేల మంది విద్యా వలంటీర్లకు మించి ఇంకా అదనంగా తీసుకోవాలి. ఇటు అదనపు తరగతి గదులు అవసరముంటుంది. ఈ నేపథ్యంలో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేయడమే మంచిదన్న అభిప్రాయంలోనే అధికారులున్నారు. మరోవైపు మార్చి నెలలో 6, 7, 8 తరగతులను ప్రారంభించినా ఈ సమస్యలు వస్తాయని, పైగా మార్చిలో వేసవి ఎండలు ఎలా ఉంటా యో తెలియదు.. ఒంటిపూట బడులనే కొనసాగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధన అవసరమా? తల్లిదండ్రులు పంపిస్తారా? అన్న సందిగ్ధం ఉన్నతాధికారుల్లో నెలకొంది. ఈ విషయాన్ని ఓసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చూద్దామనే ఆలోచన చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు (ప్రాథమిక పాఠశాలలు) మాత్రం ప్రత్యక్ష బోధన అవసరమే లేదనే అభిప్రాయంలో అధికారులున్నారు.

Published date : 19 Feb 2021 03:17PM

Photo Stories