CBSE Brings Changes In Exam Format: 11, 12 తరగతి పరీక్షల తీరులో సీబీఎస్‌ఈ కీలక మార్పులు.. కొత్త ఫార్మాట్‌లో ప్రశ్నలు
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ).. 11, 12వ తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. పుస్తకాల ద్వారా నేర్చుకున్న అంశాలను నిజ జీవిత పరిస్థితులకు అన్వయిస్తూ ప్రశ్నలుంటాయని, అందుకు తగ్గట్లు ప్రశ్నపత్రాల ఫార్మాట్‌లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కొత్త విధానం 2024-25 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందన్నారు. ఇందుకు తగ్గట్లే విషయ సామర్థ్యాన్ని అంచనా వేసేలా MCQ ప్రశ్నలను 40-50 శాతానికి పెంచి, షార్ట్, లాంగ్ ఆన్సర్ తరహా ప్రశ్నలను 40-30 శాతానికి తగ్గిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆ పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవు
జాతీయ విద్యా విధానంలో భాగంగా మూల్యాంకనం నుండి సామర్థ్యాల వరకు ఇప్పటికే బోర్డు పలు చర్యలు తీసుకుంది. తాజా మార్పులను ఉద్దేశించి సీబీఎస్‌ఈ బోర్డు డైరెక్టర్ జోసెఫ్ ఇమాన్యుయేల్ మాట్లాడుతూ.. ''21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థుల సృజనాత్మకత మరింత పెరగాలని, క్లిష్టమైన ప్రశ్నలను కూడా సులువుగా పరిష్కరించేలా ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించడమే బోర్డ్ ప్రధాన ఉద్దేశమం'' అని పేర్కొన్నారు.
ఇందుకు తగ్గట్లే కొత్త ఫార్మాట్‌లో పరీక్షలు నిర్వహిస్తామని, అయితే 9, 10 తరగతుల పరీక్షల తీరులో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.