Devarashetti Janardhan: బడిబయటి పిల్లలు 178 మంది
ఇందుకోసం విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోంది. బడిఈడు పిల్లలను గుర్తించడానికి గతనెల నుంచి సర్వే చేపట్టింది. ఈ సర్వే జనవరి 11న ముగిసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 178 మంది పిల్లలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు 138 మంది, 15 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 40 మంది ఉన్నారు. వారందరినీ సమీపంలోని పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించారు.
చదవండి: Telangana: పిల్లలతో పనిచేయిస్తే చర్యలు
క్షేత్ర స్థాయిలో..
బడిబయటి పిల్లల సర్వేను విద్యాశాఖ ఏటా నిర్వహిస్తుంది. ఈ సారి డిసెంబర్ 12 నుంచి జనవరి 11 వరకు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాఠశాల స్థాయిలో 6 ఏళ్ల నుంచి 14 ఏళ్లు గల బాలబాలికలను, కళాశాల స్థాయిలో 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న బాలబాలికలను గుర్తించారు.
విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షలో విధులు నిర్వహించే సీఆర్‌పీలు క్షేత్ర స్థాయిలో పిల్లలను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా ఇందుకోసం వర్చువల్‌గా శిక్షణ తీసుకున్న సీఆర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు ఆయా పిల్లలు బడి మానేయడానికి గల కారణాలను, వారి కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు.
అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే..
బడి బయట ఉన్న పిల్లల గుర్తింపునకు చేపట్టిన సర్వే ముగిసింది. ఇందులో గుర్తించిన పిల్లలను సమీప పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించాం. క్షేత్ర స్థాయిలో సీఆర్‌పీలు గుర్తించిన పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఈప్రక్రియ జనవరి 17వరకు కొనసాగనుంది.
– దేవరశెట్టి జనార్దన్, గుణాత్మక విద్య జిల్లా సమన్వయకర్త
సర్వే ద్వారా గుర్తించిన విద్యాశాఖ అధికారులు
- 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు 138 మంది
- 15 నుంచి 19 ఏళ్లలోపు వారు 40 మంది