గణితశాస్త్ర బోధన ఉద్దేశాలు– విలువలు
గణిత బోధనా విలువలు:
విద్యార్థుల్లో వివిధ శక్తి సామర్థ్యాలు పెంపొందించడం, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడం విద్యావిధానం ముఖ్య ఉద్దేశం. పాఠశాలలో బోధించే విషయాలు ఒక్కొక్కటీ విద్యార్థుల్లో కొన్ని శక్తి సామర్థ్యాలను అభివృద్ధిపర్చే శక్తుల్ని కలిగి ఉంటాయి. ఆ శక్తులనే విలువలు అంటాం. గణితశాస్త్రానికి ఉన్న శక్తులను గణిత బోధనా విలువలు అంటాం.
విద్యా విలువలు చాలా విశాలమైనవి. అవి ఒక దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని నిర్మితమవుతాయి. అలా నిర్మితమైన విద్యా విలువలు విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాల వృద్ధికి తోడ్పడి అతడు సంఘంలో వ్యక్తిగా గుర్తింపు పొందడానికి ఉపయోగపడేలా ఉంటాయి.
గణిత బోధనలో విద్యా విలువలు.
1. ప్రయోజన విలువ:
సమాజంలో ఏ స్థాయికి చెందిన వ్యక్తికైనా, ఏ వృత్తికైనా గణితజ్ఞానం అవసరం.
నిత్యజీవిత సమస్యలను జయప్రదంగా, సులభంగా సాధించడానికి గణితం ఉపయోగపడుతుంది.
ప్రతివ్యక్తీ పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా గణితాన్ని వినియోగిస్తాడు.
ప్రతి శాస్త్రం కచ్చితత్వాన్ని సాధించడానికి గణితం అవసరం.
గణితశాస్త్ర పఠనం ద్వారా విద్యార్థుల్లో వేగం, కచ్చితత్వం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సమయ పాలన, సమస్యా విశ్లేషణ, స్వేచ్ఛాయుత ఆలోచన, తార్కిక ఆలోచన, వివేచన అలవడతాయి.
సరళత, స్పష్టం, నిశ్చలత్వం, సృజనాత్మకత అనేవి గణిత అధ్యయనం ద్వారా మాత్రమే ఏర్పడతాయి. ఈ లక్షణాలే గణితాన్ని అధ్యయనం చేసేవారికి క్రమశిక్షణను అందిస్తాయి.
3. సాంస్కృతిక విలువ:
ఒక సమాజం ఆచరించే ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు మొదలైనవి ఆ సమాజ నాగరికత, సంస్కృతిని తెలుపుతాయి. నాగరికత, సంస్కృతి సమాజంలోని కొన్ని వైజ్ఞానిక, సామాజిక నియమాలపై ఆధారపడి ఉద్భవించాయి. కానీ వైజ్ఞానిక, సామాజిక సూత్రాలు అర్థం చేసుకోవడానికి గణిత పరిజ్ఞానం అవసరం. అంటే గణితానికి సాంస్కృతిక విలువ ఉందని చెప్పొచ్చు.
‘‘ఆధునిక మానవుడి కార్యకలాపాలైన వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ యం త్రాంగం మొదలైన వాటిని గణిత తర్కం ప్రకారం ప్రదర్శించొచ్చు’’ – స్మిత్.
సంగీతం, పద్యరచన, శిల్పం, చిత్రలేఖనం మొదలైన కళల అభివృద్ధి గణితంపై ఆధారపడి ఉంటుంది.
4. సామాజిక విలువ:
సమాజ అభివృద్ధికి కారకాలు శాస్త్ర, సాం కేతిక రంగాల అభివృద్ధే. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి గణితంపై ఆధారపడి ఉంది. అందువల్ల గణితం పరోక్షంగా సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది.
సంఘంలో సభ్యులుగా సామాజిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత తరగతి విద్యార్థులపై ఉంది.
5. మేథా సంబంధిత విలువ:
గణితశాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో పరిశీలనా శక్తి, ఏకాగ్రత, తార్కిక ఆలోచన, క్రమబద్ధ్దమైన వివేచన మొదలైన మేథాశక్తులు అభివృద్ధి చెందుతాయి.
సంపాదించిన జ్ఞానాన్ని సందర్భానుసారంగా వివేకంతో వినియోగించుకోవాలి.
6. సౌందర్యాత్మక విలువ:
ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది.
ప్రకృతిని పరిశీలించి అర్థం చేసుకోవడానికి గణితం ముఖ్యమైన ఉపకరణ.
7. సృజనాత్మక విలువ:
సృజనాత్మకత అంటే కొత్త విషయాన్ని కనుక్కోవడం లేదా ఉన్న విషయాల్లోని దృక్పథాల్లో మార్పు తేవడం
గణిత శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించొచ్చు.
గణిత పజిల్స్, గణితంలో పొడుపు కథలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయి.
8. మానసిక విలువ:
గణిత పఠనం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనా మార్పు వస్తుంది.
అభిరుచులు, వైఖరుల్లో మార్పు వచ్చి గణిత అభ్యసన వల్ల ఉపయోగాన్ని సమగ్రంగా వినియోగించుకుంటారు.
గణితశాస్త్ర బోధనోద్దేశాలు:
ఏ ఫలితాలను ఆశించి గణితబోధన చేస్తామో వాటిని ‘గణిత బోధనాశయాలు’ లేదా ‘గణిత బోధనోద్దేశాలు’ అంటాం. ఇవి బోధన పూరై్తన తర్వాత సిద్ధిస్తాయి.
గణితశాస్త్రానికుండే విలువలే బోధన వల్ల ప్రయోజనాలవుతాయి. వాటినే మనం ఆశిస్తాం. కాబట్టి ప్రయోజనాలే ఉద్దేశాలవుతాయి. గణితశాస్త్ర ఉద్దేశాలు, విలువలకు దగ్గర సంబంధముంది. కానీ ఉద్దేశాలు, విలువలకు తేడా.. వ్యక్తపరచడంలోనే ఉంది.
ఒక వ్యక్తి బజారులో వస్తువులు కొన్నప్పుడు గణితాన్ని ఉపయోగిస్తాడు. దాన్ని ప్రయోజన విలువలో చెప్పినట్లైతే ‘నిత్యజీవితంలో గణితాన్ని వినియోగిస్తాడు’. అదే ఉద్దేశ రూపంలో ఐతే‘గణితాన్ని నిత్యజీవితంలో ఉపయోగించేలా చేయడం’ అని చెబుతాం.
విద్యా ఉద్దేశాలు విద్యా విధానంలో అంతిమ ఉద్దేశాలు. గణిత బోధనకు ఒక గమ్యం, దిశను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతాయి. ఉపాధ్యాయుడు గణితాన్ని ఎందుకు బోధించాలో తెలుసుకోవడానికి సహకరిస్తాయి.
బోధనోద్దేశాలు వాటి సాధనా కాలాన్ని బట్టి రెండు రకాలు అవి..
1) దీర్ఘకాలిక (దూరస్థ) ఉద్దేశాలు
2) తక్షణ ఉద్దేశాలు
పరిధిని బట్టి బోధనోద్దేశాలు రెండు రకాలు. అవి..
1) సాధారణ ఉద్దేశాలు
2) నిర్దిష్ట ఉద్దేశాలు
గణిత శాస్త్ర బోధనలో స్థాయిని బట్టి ఉద్దేశాలు మారుతుంటాయి. అన్ని స్థాయిల్లో ఉపయోగపడే విధంగా ఉద్దేశాలు తెలుసుకుందాం.
1. ప్రయోజనోద్దేశం:
గణితంలో సంఖ్యలను వాస్తవాలుగా లేదా వాస్తవాలను సంఖ్యలుగా మార్చే అవినాభావ సంబంధం ఉంది.
గణిత విద్య వాస్తవాలను సంఖ్యల రూపంలో క్లుప్తంగా ఉపయోగించడంలో విద్యార్థి తన ప్రతిభ కనబర్చేలా ఉండాలి.
విద్యార్థుల ప్రతిభ కనబర్చేలా తగిన బోధనాభ్యసన సామగ్రితో బోధనా అభ్యసన ప్రక్రియలు కల్పించాలి.
విద్యార్థులు గణితాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకొని ఉన్నత దశకు చేరుకోవాలి.
2. ఉదరపోషణోద్దేశం:
ప్రతి వ్యక్తీ నేర్చుకునే విద్య మొదటగా ఉదర పోషణార్థమై ఉంటుంది.
గణిత విద్య వ్యక్తి జీవన విధానాన్ని అభివృద్ధి పరిచేలా ఉంటుంది.
ప్రతి వ్యక్తి వారి వారి స్థాయి, నైపుణ్యాన్ని బట్టి ఎంచుకొన్న జీవన విధానంలో గణితాన్ని అనేక రకాలుగా వినియోగిస్తాడు.
ఉదర పోషణోద్దేశం, ప్రయోజనోద్దేశం రెండు ఒకే నాణేనికి ఉన్న బొమ్మ, బొరుసు వంటివి.
3. క్రమశిక్షణోద్దేశం:
గణిత బోధన విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవర్చడానికి ఉపయోగపడుతుంది.
క్రమశిక్షణ విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, వివేచన, విశ్లేషణ, సునిశితత్వాలను అభివృద్ధి చేస్తుంది.
క్రమశిక్షణ ఒక వ్యక్తి దేన్ని మొదట, మధ్యలో, తుదిగా చేయాలో అనేది నిర్ణయించడానికి అవకాశం ఇస్తుంది.
క్రమశిక్షణాభ్యసనం వల్ల విద్యార్థి తన పనులను స్వయంగా, నియమానుసారం సకా లంలో పూర్తి చేయగలుగుతాడు.
4. వృత్తి సంబంధమైన ఉద్దేశం:
ప్రతి వ్యక్తి ఏదో ఒక వృత్తిని చేపట్టి స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటాడు.
ఏ వృత్తిలో రాణించాలన్నా గణిత జ్ఞానం అవసరం అందువల్ల పాఠశాల స్థాయిలో విద్యార్థుల భావి జీవితానికి అవసరమైన అంశాలన్నీ విద్యా ప్రణాళికలో చేర్చారు.