Skip to main content

రైల్వే కొలువుల కూత..!

భారత రైల్వేల చరిత్రలో తొలిసారిగా భారీ సంఖ్యలో 89,409 ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ వేర్వేరుగా రెండు నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. మొదట 26,502 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పీ), టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఊపిన రైల్వే మంత్రిత్వశాఖ..
వెంటనే మరో 62,907 గ్రూప్-డి ఉద్యోగాలకు ప్రకటనఇచ్చింది. మొత్తంగా 89,409 పోస్టుల భర్తీచేపట్టనుంది. ఈ నేపథ్యంలో సదరు రైల్వే నోటిఫికేషన్‌ల వివరాలు, ఎంపిక తీరు, ప్రిపరేషన్ టిప్స్ తెలుసుకుందాం..

26,502 ఏఎల్‌పీ, టెక్నీషియన్
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లల్లో 26,502 టెక్నిషియన్, అసిస్టెంట్ లోకోపెలైట్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడులైంది. ఈ మొత్తం ఖాళీల్లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ), సికింద్రాబాద్ పరిధిలో 3,262 పోస్టులుండటం తెలుగు విద్యార్థులకు మంచి అవకాశమని చెప్పొచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ప్రారంభ వేతనం నెలకు రూ.19,900 ఉంటుంది. ఇతర అలవెన్సులు లభిస్తాయి.

అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ట్రేడ్‌అప్రెంటీస్‌షిప్/ ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)/ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసు కోవచ్చు. వయసు: 2018, జూలై1నాటికి 18-28 ఏళ్లు(నోటిఫికేషన్ ప్రకారం- గరిష్ట వయోపరిమితి 28ఏళ్ల, ఆ తర్వాత అన్ని పోస్టులకు మరో రెండేళ్లు వయోపరిమితి పెంచుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది). రిజర్వేషన్ కేటగిరీకి నిబంధనల మేరకు సండలింపు ఉంటుంది. పరీక్ష విధానం: ఏఎల్‌పీ/టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడిగా రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) ఉంటుంది. టెక్నీషియన్ పోస్టులకు రెండోదశ ద్వారానే తుది ఎంపిక జరుగుతుంది. ఏఎల్‌పీ పోస్టులకు మాత్రం రెండో దశ సీబీటీ అనంతరం కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏటీ) నిర్వహిస్తారు.

తొలిదశ సీబీటీ ప్రశ్నపత్రంలో 75 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి గంట. మ్యాథమెటిక్స్; జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్; జనరల్ సైన్స్; జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. తొలిదశలో అర్హత సాధించిన వారికి రెండోదశ సీబీటీ నిర్వహిస్తారు. కేటగిరీల వారీగా మొత్తం పోస్టుల సంఖ్యకు 15 రెట్ల మంది అభ్యర్థులను రెండోదశ పరీక్షకు పిలుస్తారు. రెండోదశ పరీక్షలో పార్ట్-ఏ(100 ప్రశ్నలు, 90 నిమిషాలు), పార్ట్-బీ(75 ప్రశ్నలు, 60 నిమిషాలు) ఉంటాయి. పార్ట్-ఏలో మ్యాథమెటిక్స్; జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్; బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బీ (అర్హత పరీక్ష మాత్రమే)లో సంబంధిత ట్రేడ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.

మొదటి, రెండో దశ సీబీటీలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతితప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు. తదుపరి ఎంపిక ప్రక్రియకు రెండోదశలోని పార్ట్-ఏలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసు కుంటారు. అభ్యర్థులు ఏదో ఒక ఆర్‌ఆర్‌బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తురుసుం:
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్/పీడబ్ల్యూడీ/మహిళలు/ట్రాన్స్‌జెండర్/మైనారిటీలు/ఈబీసీ అభ్యర్థులకు రూ.250. మిగిలిన వారికి రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 5, 2018.
తొలిదశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఏప్రిల్ /మే, 2018.

62,907 గ్రూప్ డీ పోస్టులు
అసిస్టెంట్ లోకోపైలట్/టెక్నిషియన్ ఉద్యోగాల ప్రకటన తర్వాత... కొద్దిరోజులకే 62,907 గ్రూప్ - డి పోస్టులతో మరో భారీ నోటిఫికేషన్‌ను రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ మొత్తం పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే-సికింద్రాబాద్‌లో 6,523 ఖాళీలు ఉన్నాయి. గ్రూప్-డి పోస్టుల్లో హెల్పర్స్, ట్రాక్ మెయిన్‌టైనర్, పాయింట్స్‌మన్, గేట్‌మన్, పోర్టర్స్ వంటి పలు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.18,000 వేతనంతోపాటు ఇతర అలవెన్సులు, సౌకర్యాలు లభిస్తారుు. అర్హతలు: పోస్టులను బట్టీ పదో తరగతి/ఐటీఐ/ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. (కోర్సు ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు అనర్హులు). నోటిఫికేషన్ ప్రకారం-2018, జూలై1 నాటికి 18-31ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.(తర్వాత గరిష్ట వయోపరిమితి మరో 2ఏళ్లు పెంచుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది). రిజర్వేషన్ వర్గాల వారికి నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక: మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) నిర్వహించి.. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శారీరకదారుఢ్య పరీక్షలు ఉంటాయి. సీబీటీలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

దరఖాస్తులు: ఏదేని ఒక ఆర్‌ఆర్‌బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో https://rrbsecunderabad.nic.in/  వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2018, మార్చి 12.
దరఖాస్తు రుసుం: రూ.500, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/పీడబ్ల్యుడీ/మహిళలు/ ట్రాన్స్‌జెండర్లు/ మైనార్టీలు/ ఈబీసీలకు ఫీజు రూ. 250. పరీక్ష తేది: 2018 ఏప్రిల్, మేల్లో ఉంటాయి.

పరీక్ష విధానం
సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)లో 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల సమయం ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్కులుంటాయి. నిబంధనలు ప్రకారం- జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 మార్కులు, ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు కనీసం 30 మార్కులు సాధించి, మెరిట్‌లో ఉంటేనే తుది జాబితా రూపొందించే క్రమంలో పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రిపేర్ అవ్వండిలా
రెండు పరీక్షల సీబీటీల్లో నాలుగు సెక్షన్లు కామన్‌గా ఉన్నాయి. అవి..
మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్

మ్యాథమెటిక్స్
ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న డెసిమల్స్, ఫ్రాక్షన్స్ చాప్టర్లను చూసుకోవాలి.కసాగు, గసాభా, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, మెన్సురేషన్, కాలం-పని, కాలం-దూరం, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, ఆల్జీబ్రా, జామెట్రీ, త్రికోణమితి, సాంఖ్యకశాస్త్రం తదితర బేసిక్ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ముందుగా నంబర్లపై పట్టు సాధించాలి. ముఖ్యంగా నంబర్ సిస్టమ్స్, బోడ్‌మస్ నిబంధనలను మొదట తెలుసుకోవాలి. కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారాలు, శాతాలు వంటి ప్రాథమిక అర్థమెటిక్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కాలు, వర్గాలు-వర్గమూలాలు, ఘనమూలాలు కంఠస్తం చేయాలి. వయసుపై అడిగే ప్రశ్నలు, క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ సిస్టర్న్ చాప్టర్లను బాగా ప్రాక్టీస్ చేయాలి.

జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్
ఈ సెక్షన్‌లో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అల్ఫాబెటికల్, నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్ష్, ఆడ్‌మాన్ అవుట్, సింబల్స్, నొటేషన్‌‌స, వెన్ చిత్రాలు, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, డెరైక్షన్‌‌స, స్టేట్‌మెంట్-కన్‌క్లూజన్, స్టేట్‌మెంట్- అసంప్షన్, డెసిషన్ మేకింగ్, సిలాజిజం విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అన్ని విభాగాలను ప్రాక్టీస్ చేయాలి.

జనరల్ సైన్స్
పదోతరగతి స్థాయి వరకు సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి 6 నుంచి పదోతరగతి వరకు పుస్తకాలు సేకరించుకొని ప్రిపరేషన్ సాగించాలి. సొంతంగా నోట్స్ రాసుకోవడం మేలు. దాని ద్వారా సులువుగా గుర్తుండిపోవడంతోపాటు పరీక్ష సమయంలో పునశ్చరణకు దోహదపడుతుంది. నిత్యజీవితంలో జరిగే సైన్స్ సంబంధిత అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్
ఇందులో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అడుగుతారు. వివిధ దేశాల అధ్యక్షులు, భారతదేశ భౌగోళిక స్థితిగతులు, రాజకీయ వ్యవస్థ, ఇతర దేశాలతో సంబంధాలు, కొత్తగా ప్రవేశపెడుతున్ను బిల్లులు, దేశాల కరెన్సీలు, వార్తల్లోని వ్యక్తులు, రచయితలు మొదలైన సమకాలీన అంశాలు తెలుసుకోవాలి. వీటితోపాటు శాస్త్ర సాంకేతిక రంగంలో చోటుచేసుకున్న సంఘటనలు, డిఫెన్స్ టెక్నాలజీ, మిలిటరీ ఎక్సెర్‌సైజ్‌లు, తాజాగా క్రీడల్లో జరిగిన చెప్పుకోదగిన పరిణామాలు, బడ్జెట్, అందులో ముఖ్య అంశాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాటి లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలి.
Published date : 23 Feb 2018 03:57PM

Photo Stories