Computer Proficiency: జేఎన్‌టీయూలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షలు
సాక్షి ఎడ్యుకేషన్: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్ గౌతమి ఆదేశాల మేరకు ఈ నెల 12న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ గాయత్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థుల జాబితాను అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టరేట్లు, అన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దారు కార్యాలయాల నోటీసు బోర్డులో ఉంచామని పేర్కొన్నారు.
అదే విధంగా జిల్లా వెబ్ పోర్టల్ ananthapuramu. a p.gov.in లోనూ అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో తదుపరి భాగంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జేఎన్‌టీయూలోని సెంట్రల్ కంప్యూటర్ సెంటర్‌లో జరుగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు ప్రవేశ అనుమతి పత్రంతో పాటు ఏదేని గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకుని ఉదయం 9.30 గంటలకు పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు.