KNRUHS: ఈ కోటా ఎంబీబీఎస్ సీట్లలో ఇతరులకూ అవకాశం
వాస్తవంగా ఈ సీట్లను ఎన్‌ఆర్‌ఐ ధ్రువీకరణ పత్రం ఉన్నవారికే కేటాయిస్తారు. గతేడాది వరకు అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయి, ఇలా మిగిలిన సీట్లను ఆయా ప్రైవేటు మెడికల్ కాలేజీలే నింపుకొనేవి. కానీ ఇప్పుడు అలా నింపుకొనే పద్ధతికి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) బ్రేక్ వేసింది.
దీంతో మిగిలిన సీట్లను స్ట్రే వేకెన్సీ పద్ధతిలో కాళోజీ నారాయణరావు ఆరో గ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే భర్తీ చేయనుంది. అయితే అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తయిన తర్వాత కూడా సీట్లు మిగిలిపోవడంతో అవి ఏ మేరకు నిండుతాయోనని అధికారులు అంటున్నారు.
చదవండి: Prof KC Reddy: ‘విద్యా విధానంలో మార్పులు గమనించాలి’
128 సీట్ల మిగులు...
రాష్ట్రంలో 30 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,825 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం అంటే 723 ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లున్నాయి. వాటికి మాప్‌అప్ రౌండ్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దాదాపు 12.20 లక్షల ర్యాంకు వచ్చిన వారికి కూడా ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీట్లు లభించాయి. అంతకంటే ఎక్కువ ర్యాంకున్న వారికి కూడా సీట్లు వచ్చే అవకాశమున్నా విద్యార్థులు ముందుకు రావడంలేదు. దీంతో 128 ఎన్‌ఆర్‌ఐ సీట్లు మిగిలిపోయాయి.
ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల ఫీజు ఏడాదికి రూ. 23 లక్షల వరకు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇంతకంటే తక్కువ ఫీజుతో పక్క రాష్ట్రాల్లోని డీమ్డ్ వర్సిటీల్లోనూ సీట్లొచ్చే చాన్స్ ఉండటంతో విద్యార్థులు ముందుకు రావట్లేదన్న అభిప్రాయం నెలకొంది. దీనికితోడు రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటవడంతో వాటిల్లో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. కన్వీనర్ కోటా, బీ కేటగిరీ సీట్లూ పెరగడంతో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లవైపు రావడానికి చాలా మంది ముందుకు రావడంలేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ సీట్లు మిగలడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. స్ట్రే వేకెన్సీ పద్ధతిలో మిగిలిన ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను భర్తీ చేయాలనుకున్నా తక్కువ ఫీజు తీసుకుంటేనే విద్యార్థులు చేరే అవకాశముంది.కొన్ని కాలేజీలు ఎన్‌ఆర్‌ఐ కోటా సీటును తక్కువ ఫీజుకే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.