NEET: ‘నీట్’ పరీక్షపై నిఘా
మెడికల్‌లో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష సెప్టెంబర్ 12న జరగనుంది. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలుచోట్ల పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్ పరీక్షపై రాష్ట్రంలో సీబీఐ కూడా నిఘా ఉంచినట్లు తెలిసింది. ప్రత్యేక చర్యల్లో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద వైఫై సౌకర్యాన్ని నిలిపివేస్తారు. ఈమేరకు జామర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే గతంలో ఉన్న కొన్ని పరీక్షా కేంద్రాలను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వాటిస్థానంలో అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఎక్కడా అక్రమాలకు తావులేకుండా నీట్ పరీక్ష నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు. జేఈఈ (మెయిన్) పరీక్ష–2021లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కొందరిని హరియాణాలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.