Skip to main content

యూజీసీ: పస లేని పీహెచ్‌డీ పరిశోధనలు.. కేవలం డిగ్రీల కోసమే..

సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు ఏటా లెక్కకు మిక్కిలిగా ఉంటున్నా .. పరిశోధన పత్రాలు సమర్పించి అవార్డులు పొందుతున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటోంది.
పూర్తయిన వాటిలో కూడా చాలావరకు పరిశోధనల స్థాయి ఏమాత్రం ఆశాజనకంగా ఉండడం లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ నియమించిన కమిటీ తేల్చింది. కేవలం డిగ్రీల కోసమే అన్నట్లుగా పరిశోధనలు ఉంటున్నాయని, ఉన్నత ఉద్యోగానికి, పదోన్నతులకు సంబంధించి ఒక అర్హతగా భావించి మాత్రమే పీహెచ్‌డీలు చేస్తున్నట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసి అవార్డులు పొందుతున్న వారి సంఖ్య నామమాత్రంగానే ఉంటోందని చెబుతున్నారు.

ఏటా పెరుగుతున్న చేరికలు
పరిశోధనల కోసం దేశంలోని వర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ కోర్సులో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. 2010-11 నుంచి 2017-18 వరకు పీహెచ్‌డీలో చేరికలు చూస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కన్పిస్తోంది. 2010-11లో పీహెచ్‌డీలో 77,798 మంది ఉండగా, 2017-18 నాటికి ఆ సంఖ్య 1,61,412కు పెరిగింది. పీహెచ్‌డీలో మహిళల కన్నా పురుషులు ఎక్కువగా చేరారు. 2017-18లో పీహెచ్‌డీలో పురుషులు 92,570 మంది, మహిళలు 68,842 మంది ఉన్నారు. సైన్స్‌, ఇంజనీరింగ్ విభాగాల్లో ఎక్కువగా చేరికలు ఉంటున్నాయి.

ఆయా విభాగాల్లో పీహెచ్‌డీలో చేరికల శాతం

విభాగం

శాతం

సైన్స్‌

30

ఇంజనీరింగ్

26

సోషల్ సైన్స్‌

12

ఇండియన్ లాంగ్వేజెస్

6

మేనేజ్‌మెంట్

6

అగ్రి సెన్సైస్

4

మెడికల్ సెన్సైస్

5

ఎడ్యుకేషన్

5

కామర్స్

3

ఫారిన్ లాంగ్వేజెస్

3


పరిశోధనల్లో సారం లేదు: యూజీసీ కమిటీ
చాలా తక్కువ శాతం మంది పీహెచ్‌డీలు పూర్తి చేస్తుండగా.. చాలావరకు పరిశోధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కానీ, తమదైన ముద్రతో కానీ ఉండటం లేదని యూజీసీ కమిటీ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్దిష్ట అంశంలో సైద్ధాంతికంగా, అనువర్తిత అంశాల కోణంలో (అప్లయిడ్ ఆస్పెక్ట్) పరిశోధనలు ఉండడం లేదని పేర్కొంది. చర్విత చర్వణంగా గతంలో ఉన్న అంశాలనే మళ్లీమళ్లీ పరిశోధనలకు తీసుకొనే విధానం వల్ల ప్రయోజనం ఉండడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పరిశోధనల ప్రవేశాలకు ఎంట్రన్సు టెస్టు, ఇంటర్వ్యూల విధానాన్ని పెట్టడంతో పాటు అర్హత మార్కులను కూడా యూజీసీకి కమిటీ నిర్దేశించింది. ప్రతి పరిశోధనా విద్యార్థికి మార్గదర్శి (గైడ్) ఏర్పాటు, ఇతర అంశాలను నివేదించింది. దాని ప్రకారం నూతన విద్యావిధానంలో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలపై పలు మార్పులను కేంద్రం ప్రకటించింది.

ఆయా సంవత్సరాల్లో పీహెచ్‌డీలో చేరికల తీరు ఇలా..

ఏడాది

పీహెచ్‌డీ

2010-11

77,798

2011-12

81,430

2012-13

95,425

2013-14

1,07,890

2014-15

1,17,301

2015-16

1,26,451

2016-17

1,41,037

2017-18

1,61,412


అయా సంవత్సరాల్లో అవార్డులు పొందినవారి సంఖ్య

ఏడాది

అవార్డులు

2011-12

23,630

2012-13

23,861

2013-14

21,830

2014-15

24,171

2015-16

28,779

2016-17

34,400

Published date : 24 Dec 2020 05:20PM

Photo Stories