Skip to main content

వసతిగృహాల్లో మౌలిక వసతుల కొరతపై సర్కారు దృష్టి: సంక్షేమ హాస్టళ్లలో సమస్యలేంటి?

సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నవేంటి.. విద్యార్థులు చేరితే ఎదురయ్యే ఇబ్బందులేంటి.. వాటిని ఎలా పరిష్కరించాలి? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

లాక్‌డౌన్ నుంచి సంక్షేమ వసతి గృహాలకు తాళం పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాల సంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతు లిచ్చినా.. విద్యా సంస్థలు, వాటి అనుబంధ సంస్థలను తెరిచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాదాపు అన్ని తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన కొనసాగిస్తున్నారు. ప్రాధాన్య క్రమంలో పాఠశాలలకు విద్యార్థులను అనుమతించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో సంక్షేమ హాస్టళ్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచేలా సంక్షేమ శాఖలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది.

16 కేటగిరీల్లో వివరాలు..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో దాదాపు 1,570 వసతి గృహాలున్నాయి. వీటి పరిధిలో గతేడాది దాదాపు 2 లక్షల మంది వసతి పొందారు. తాజాగా వీటిని తెరిస్తే ఈ మేరకు అడ్మిషన్లు చేసుకునేలా మౌలిక వసతులు కల్పించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతి హాస్టల్ స్థాయిలో మౌలిక వసతులపై నివేదికలు కోరాయి. ఇందుకు ప్రత్యేకంగా 16 కేటగిరీల్లో అంశాలను ప్రస్తావిస్తూ ఫార్మాట్ తయారు చేసి క్షేత్రస్థాయి అధికారులకు పంపాయి. ఈ నెలాఖరులోగా జిల్లాల వారీగా సమాచారం ఇవ్వాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించాయి. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ హాస్టళ్లు మూసేయడంతో తలెత్తిన కొత్త సమస్యలను సైతం ఇందులో పొందుపర్చాలని స్పష్టం చేశాయి. జిల్లా సంక్షేమాధికారులకు ప్రత్యేక ఫార్మాట్‌లను పంపిన సంక్షేమ శాఖలు.. నెలాఖరులోగా పూర్తి సమాచారం సమర్పించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ స్పష్టం చేశాయి.

మిగులు నిధులతో పనులు..
2020-21 వార్షిక సంవత్సరం ప్రారంభమై 7 నెలలు గడిచింది. ఇప్పటివరకు హాస్టళ్లు తెరవకపోవడంతో ఈ వార్షిక సంవత్సరంలో ఈ హాస్టళ్లకు బడ్జెట్ విడుదల చేయలేదు. ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు మిగిలిపోవడంతో వాటిని మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని సంక్షేమ శాఖలకు ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి నివేదికలు స్వీకరించాక ఏ మేరకు పనులు చేయొచ్చనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Published date : 09 Nov 2020 03:51PM

Photo Stories