‘వర్క్ ఫ్రం హోమ్’తో ఐటీ కంపెనీలకు నిర్వహణవ్యయ ప్రయాసలు తగ్గాయ్: నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక
Sakshi Education
సాక్షి, అమరావతి: ‘వర్క్ ఫ్రం హోమ్’ విధానంపై ఐటీ ఉద్యోగులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా వ్యయ ప్రయాసలు తగ్గడం వారికి సానుకూలంగా ఉంది. మరోవైపు ఐటీ కంపెనీలు సైతం నిర్వహణ వ్యయం తగ్గుతోందని సంతృప్తి చెందుతున్నాయి. ప్రముఖ మార్కెట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా దేశంలో 9 ప్రధాన నగరాల్లోని ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో ‘వర్క్ ఫ్రం హోమ్’ విధానంపై సర్వే నిర్వహించింది. ఈ ఏడాది చివరి వరకూ ఇదే విధానాన్ని కొనసాగించాలన్న ఏకాభిప్రాయం దాదాపు వ్యక్తం కావడం గమనార్హం.
ఆ సర్వే నివేదికలోని ప్రధాన అంశాలు..
- ఒక్కో ఐటీ ఉద్యోగికి నెలకు సగటున రూ.5,520 ఖర్చు తగ్గింది. ప్రయాణ ఖర్చులు, ఆహారం, దుస్తుల ఖర్చు ప్రధానంగా తగ్గిందని ఉద్యోగులు చెప్పారు. ఇది సగటు ఐటీ ఉద్యోగి జీతంలో 17 శాతం.
- గతంలో ప్రతి ఐటీ ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకు రోజుకు సగటున గంటన్నర సమయం వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ సమయం మిగులుతోంది.
- దాంతో పని గంటలు కూడా పెరుగుతున్నాయి. దీనివల్ల ఏడాదికి ఒక్కో ఉద్యోగి సగటున 44 గంటలు అదనంగా పనిచేయగలరని అంచనా వేశారు.
- కనీసం 100 మంది ఉద్యోగులు ఉన్న ఐటీ కంపెనీ ఏడాదికి 18 అదనపు రోజులు పని చేసినట్టు అవుతుంది.
- అందుకే 74 శాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ విధానానికే మొగ్గు చూపారు.
- ఇక 80 శాతం మంది ఉద్యోగులు కరోనా వైరస్ ముప్పు తొలగే వరకూ తాము ఉద్యోగం చేస్తున్న నగరాల నుంచి కాకుండా తమ స్వస్థలాలకు వెళ్లి అక్కడి నుంచి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు.
- కాగా ఇంటర్నెట్ సమస్యలు మాత్రం ఐటీ ఉద్యోగులను వేధిస్తున్నాయి. 35 శాతం మంది ఇంటర్నెట్ తగినంత స్పీడ్ ఉండటం లేదని చెప్పారు.
- ఇక 47శాతం మంది తమ ఇళ్లల్లో పని వాతావరణం సరిగా లేదని కూడా చెప్పారు. ప్రధానంగా డెస్క్, సీటింగ్ సమస్యలు ఉన్నాయన్నారు.
- ఇంట్లో ఉండి పనిచేసేందుకు ప్రత్యేక ప్రదేశం, సరైన నెట్‌వర్క్ ఉంటే వర్క్ ఫ్రం హోమ్ విధానం పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని 71శాతం మంది చెప్పారు.
- ఈ విధానంతో సగటున కార్యాలయాల నిర్వహణ వ్యయం 2 శాతం తగ్గిందని ఐటీ కంపెనీల యాజమాన్యాలు చెప్పాయి.
- చిన్న ఐటీ కంపెనీలకు 4.7 శాతం, మధ్యస్థాయి కంపెనీలకు 4.40 శాతం, పెద్ద కంపెనీలకు 3.60 శాతం నిర్వహణ వ్యయం తగ్గింది.
Published date : 21 Sep 2020 03:45PM