Skip to main content

వీధి బాలల చదువు, పునరావాసంపై ప్రత్యేక శ్రద్ధ...!

సాక్షి, అమరావతి: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా గుర్తించిన వీధి బాలల భవితపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏపీ పోలీస్ శాఖ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో త్వరలో ఆవిష్కరించనున్న ‘ఏపీ కాప్’లో వీధి బాలల పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకునే సౌకర్యం కల్పించనున్నారు. ఈ ఏడాది మూడుసార్లు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో పోలీసులు 25,297 మంది వీధి బాలలను గుర్తించారు. వీరి భవితను తీర్చిదిద్దేందుకు పోలీసులు పక్కా కార్యాచరణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్ని జిల్లాల ఎస్పీలకు ఇచ్చిన సమాచారం ఇలా ఉంది.

  • గుర్తించిన వీధి బాలల భవితను తీర్చిదిద్దే బాధ్యతను కచ్చితంగా తీసుకోవాలి.
  • వారి పూర్తి సమాచారాన్ని ఏపీ కాప్ యాప్‌లో నిక్షిప్తం చేయాలి. ఈ విషయంలో అన్ని ప్రభుత్వ శాఖలను పోలీసులు సమన్వయం చేసుకోవాలి. వీధి బాలలు మళ్లీ బాల కార్మికులుగా ఎందుకు మారుతున్నారనే విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి.
  • వారి సంరక్షణ కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు కేంద్ర నిధులను వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. వారిని చదివించేందుకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన వంటి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి.
  • చదువు ఆపేసి ఇంటి నుంచి వచ్చేసిన బాలలకు బ్రిడ్జి స్కూల్ సౌకర్యం కల్పించడం, వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి.
  • వీధి బాలల్లో ప్రమాదకర సమూహాలను గుర్తించి వారిని సన్మార్గం వైపు నడిపించేలా చర్యలు తీసుకోవాలి. వారిపై ఏవైనా కేసులు ఉంటే వాటిని సమీక్షించి వారి భవితకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. తప్పిపోయిన బాలలపైనా దృష్టి సారించాలి.
  • వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. బడిలో ఉండాల్సిన పిల్లల్ని వీధుల పాల్జేస్తున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి.
  • జిల్లా ఎస్పీల పర్యవేక్షణలో ఎన్‌జీవో సంస్థల ప్రతినిధుల సహకారం తీసుకుని బాలల సంరక్షణ కేంద్రాలతోపాటు బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడలి ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు కొనసాగించాలి.
Published date : 21 Nov 2020 04:50PM

Photo Stories