విద్యార్థులకుమానసిక స్థైర్యం పెంచేందుకు ‘మనో దర్పణ్’
Sakshi Education
సాక్షి, అమరావతి: కోవిడ్ 19 ప్రభావం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
విద్యార్థుల్లో మానసిక, శారీరక ఇబ్బందులను తొలగించి మనోస్థైర్యాన్ని నింపేందుకు ‘మనోదర్పణ్’ ద్వారా వయో దశలను అనుసరించి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఈమేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కె.వెట్రిసెల్వి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు.
- కోవిడ్‌పై విద్యార్థుల్లో భయాందోళనలను తొలగించాలి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు , తుమ్ములు వచ్చినప్పుడు రుమాలు అడ్డం పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడాన్ని అనుసరించేలా చేయాలి.
- కోవిడ్‌ను అధిగమించిన వయోవృద్ధుల గురించి చెప్పి మనోస్థైర్యాన్ని కల్పించాలి. పిల్లల సందేహాలను నివృత్తి చేసి భరోసా కలిగించాలి. మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడించి ఒత్తిడిని అధిగమించేలా చేయాలి.
- పిల్లలు సామాజిక, దృశ్య మాధ్యమాల ద్వారా స్నేహితులతో మాట్లాడడం, చిత్రకళ, పజిల్స్, బొమ్మలు తయారు చేయటం లాంటి కార్యక్రమాలు ఇంటి నుంచే చేసేలా ప్రోత్సహించాలి. చిత్రకళ, సంగీతం, నృత్యం లాంటి కళలు నేర్చుకునే అవకాశం కలిగించాలి.
Published date : 05 Oct 2020 03:40PM