వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలోనూ ప్రాజెక్ట్ వర్క్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తరహాలో సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లోనూ ప్రాజెక్టు వర్క్‌ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థుల్లో పరిశీలన, పరిశోధన సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆ దిశగా కసరత్తు మొదలైంది. దీనికి సంబంధించిన కార్యాచరణ బాధ్యతలను ఉన్నత విద్యా మండలికి అప్పగించింది. దీంతో మండలి కూడా ప్రాజెక్టువర్క్‌ను ఏ సెమిస్టర్‌లో అమలు చేయాలి.. ఎన్ని క్రెడిట్స్ ఇవ్వాలి అన్న దానిపై చర్చించినట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ వెల్లడించారు. విద్యార్థి మూడేళ్ల పాటు చదివే ప్రతి సెమిస్టర్‌కు 25 క్రెడిట్ల చొప్పున ఆరు సెమిస్టర్లలో 150 క్రెడిట్స్ ఇస్తోంది. ఇప్పుడు ప్రాజెక్టు వర్క్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి అదనంగా నాలుగు క్రెడిట్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించింది. దీంతో డిగ్రీలో మొత్తంగా 154 క్రెడిట్స్ ఇవ్వాలని పేర్కొంది. విద్యార్థి సబ్జెక్టుకు సంబంధించిన ప్రాజెక్టునే చేసేలా చూడాలని, దీంతో సబ్జెక్టుపై సమగ్ర అవగాహన, ప్రాక్టికల్ నాలెడ్‌జ వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 1,084 డిగ్రీ కాలేజీల్లో ప్రాజెక్టు వర్క్ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Published date : 10 Jan 2020 04:39PM