వచ్చే నెలలో ప్రవేశ పరీక్షలు..అడ్మిషన్లతో విద్యార్థులు యమబిజీ
వాస్తవానికి ఈపాటికే అన్ని కోర్సుల్లో అడ్మిషన్లు పూర్తవ్వాలి. అయితే కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఎంసెట్‌తో పాటు అన్ని రకాల సెట్‌లు వచ్చేనెలలో నిర్వహించేందుకు తేదీలు ఖరారయ్యాయి. అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుండటంతో ఫలితాలను సైతం వేగంగా విడుదల చేసేందుకు ఆయా కన్వీనర్లు సిద్ధమవుతున్నారు. అనంతరం ఆన్‌లైన్ పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులకు విద్యార్హతలతో పాటు కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలు ఎంతో అవసరం. వీటిని సమర్పిస్తేనే రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతన పథకాలు వర్తిస్తాయి. ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే పథకాలు వర్తించకపోవడంతో పాటు.. జనరల్ కోటా అభ్యర్థులుగా పరిగణించే అవకాశం ఉంటుంది. దీంతో ఆఖరు నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందస్తుగా ఈ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మీసేవలో దరఖాస్తుతో సరి...
కుల, ఆదాయ, స్థానికత తదితర ధ్రువీకరణ పత్రాల కోసం సమీపంలోని మీసేవ కార్యాల యంలో సంప్రదిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి వారం, పదిహేను రోజుల్లో సర్టిఫికెట్లు పొందవచ్చు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఈ సేవలు కాస్త ఆలస్యమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు సైతం ఈ వైరస్ బారిన పడుతుండటంతో వారంతా సెలవుల్లో ఉంటున్నారు. ఫలితంగా సహోద్యోగులకు అదనపు బాధ్యతలు ఇస్తుండటంతో వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మాస్కు తప్పనిసరిగా ధరించి, శానిటైజర్లు వినియోగించి బయటకు వెళ్లాలని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. కుల ధ్రువీకరణ పత్రం ఒకసారి పొందితే ఐదేళ్ల వరకు అది చెల్లుతుంది. కానీ ఆదాయ ధ్రువీకరణ పత్రం మాత్రం ప్రతి సంవత్సరం పొందాల్సి ఉంటుంది.