ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా...నైపుణ్య కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నైపుణ్య కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించాలని స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, అందుకు తగినట్లు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు, కోర్సులపై ఏప్రిల్ 16న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భవనాల నిర్మాణం, ప్రవేశ పెట్టాల్సిన కోర్సులపై సమావేశంలో చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్య కేంద్రం ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. సమీక్షకు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
అధ్యాపకులను అప్‌గ్రేడ్ చేసేందుకు శిక్షణ :
- పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ లాంటి వివిధ కోర్సులు చదువుతున్న వారే కాకుండా, కోర్సులు పూర్తి చేసిన వారు కూడా ఈ కేంద్రాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అధ్యాపకులను అప్‌గ్రేడ్ చేసేందుకు నైపుణ్య కేంద్రాల్లో శిక్షణా తరగతులు నిర్వహించాలి.
- హై ఎండ్ స్కిల్స్ కోసం విశాఖలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఏ కోర్సుకై నా కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలి.
- ఈ సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగాల కల్పనే లక్ష్యం కావాలి...
- అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోర్సులు ఉండాలి. కోర్సులు, పాఠ్య ప్రణాళిక తయారీలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలి.
- పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఉండాలి. ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి.
- ఐటీఐ, డిప్లమో, ఇంజనీరింగ్ సహా ఇతర కోర్సులు పూర్తి చేసిన వారి నైపుణ్యాలను మరింత మెరుగు పరిచేలా కోర్సులు రూపొందించాలి. ఇప్పటికే ఆ తరహా కోర్సులు చేస్తున్న వారికి ఏడాది అప్రెంటిస్ ఇవ్వడమే ఈ యూనివర్సిటీ, నైపుణ్య కేంద్రాల ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగాలి.
- ప్రతి నైపుణ్య కేంద్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు జీవనోపాధి కోసం ఇతరులకు చిన్న చిన్న పనులు నేర్పించడానికి శిక్షణ తరగతులు నిర్వహించాలి.
Published date : 17 Apr 2020 01:49PM