Skip to main content

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం: సీఎం కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19తో మూతపడ్డ బడులు... 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభమైన 8 నెలల తర్వాత తెరుచుకోనున్నాయి.
ఉన్నత పాఠశాలలు, కాలేజీలను ఫిబ్రవరి 1 నుంచి తెరిచేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిది, ఆపై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలి. ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకూ అప్పటినుంచే ప్రత్యక్ష విద్యా బోధన మొదలుపెట్టాలి. ఈలోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను, వాటిలోని టాయిలెట్లను సిద్ధం చేయాలి. అవన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలి. విద్యా సంస్థలు పనిచేయక చాలా రోజులు అవుతోంది కాబట్టి అందులోని సామగ్రినంతటినీ శుభ్రపర చాలి. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర వంట సరుకులు పురుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాకును సరిచూసుకోవాలి. మొత్తంగా ఈనెల 25లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సోమవారం ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

వెంటనే పదోన్నతులు...
ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాతనే ఆయా శాఖల్లో ఏర్పడే ఖాళీలపై స్పష్టత వస్తుందన్నారు. అప్పుడు జిల్లాల వారీగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను కోరారు. ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని ఆదేశించారు. కారుణ్య నియామకాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పారు.
Published date : 12 Jan 2021 02:34PM

Photo Stories