‘స్కూల్ అడ్మిషన్లకు పరీక్షలు నిర్వహించొద్దు’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.
అలాగే విద్యార్థి అడ్మిషన్ తీసుకునే సమయంలో ఎలాంటి క్యాపిటేషన్ ఫీజును కూడా వసూలు చేయవద్దని తేల్చిచెప్పింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ శనివారం ఆదేశాలు జారీచేసింది. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ల సమయంలో అర్హత పరీక్షలు, స్కాలర్‌షిప్ టెస్టులు, క్యాపిటేషన్ ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) విద్యాశాఖకు వినతి అందించింది. దీంతో స్పందించిన విద్యాశాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించడం, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం, అడ్మిషన్ టెస్టు నిర్వహించడం విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Published date : 29 Mar 2021 04:14PM