Skip to main content

సీపీఎస్ ఉద్యోగులపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సీఎం జగన్

సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఈ జాబితాలో చేర్చాలని చెప్పారు. కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్), కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉందన్నారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం జీవోలు జారీ చేసి, ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసి, టర్మ్ అయిపోయాక అమలవుతుందని చెప్పిన ఘనత గత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ జీవోలను అమలు చేశామని వివరించారు. మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కూడా మన ప్రభుత్వమే అమలు చేసిందని స్పష్టం చేశారు.

  • కాంట్రిబ్యూటరీ పింఛను పథకానికి (సీపీఎస్) సంబంధించిన సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించారని అధికారులు తెలిపారు.
  • రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 మంది ఉండగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 3,295 మంది ఉన్నారని, మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని చెప్పారు. వీరికి సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తే రూ.23 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు.
Published date : 13 Nov 2020 03:56PM

Photo Stories