Skip to main content

సెలవులు విద్యార్థులకే.. టీచర్లు స్కూళ్లకు వెళ్లాలి: టీఎస్ విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్: పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించినా టీచర్లు మాత్రం పాఠశాలలకు వెళ్లాలని, పరీక్షల విధులను నిర్వర్తించాలని, పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు.
అందుకు అనుగుణంగా డీఈవోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మార్చి 16 (సోమవారం)న ఇంటర్మీడియెట్, పాఠశాల విద్యాశాఖ జిల్లాల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ విధులు, టెన్త్ పరీక్ష విధులు పడిన వారు కచ్చితంగా వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కోవిడ్ వైరస్ ప్రభావం నేపథ్యంలో ఇచ్చిన సెలవులు విద్యార్థులకు మాత్రమేనని, టీచర్లకు కాదని పేర్కొన్నారు. పరీక్ష విధులు కాకుండా మిగతా ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలని, ఇతర పెండింగ్ పనులను చేసుకోవాలని సూచించారు. యూడైస్, వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసుకోవడం, ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షల ఫలితాలన వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. మార్కుల రిజిస్టర్లను పూర్తి చేయాలని తెలిపారు. ఇతర అన్ని రికార్డులను రాసుకోవాలని పేర్కొన్నారు. వీటితోపాటు స్థానికంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రైవేటు స్కూల్ టీచర్లు రొటేషన్ బేసిస్‌లో స్కూల్‌కు వెళ్లి పనులు చేసుకోవచ్చని సూచించారు.

బంద్ చేయని స్కూళ్లకు నోటీసులు..
ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మూసివేయకుండా, తరగతులను నిర్వహించిన పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. తాము గుర్తించిన విద్యా సంస్థలపై చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇవేకాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు తరగతులను నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ దృష్టికి వచ్చింది. వాటిపైనా చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. అందులో మంత్రి మల్లారెడ్డి బంధువు విద్యా సంస్థ కూడా ఉన్నట్లు సమాచారం.

మాస్క్‌లతో టెన్త్ విద్యార్థులకు అనుమతి..
ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కరోనా నేపథ్యంలో మాస్క్‌లతో అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలకు హాజరు కావచ్చని వెల్లడించింది. ఇప్పటికే విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మరో వైపు పాఠశాలలు హాల్‌టికెట్ల పంపిణీని సోమవారం నుంచి ప్రారంభించాయి.
Published date : 17 Mar 2020 01:07PM

Photo Stories