Skip to main content

ప్రైవేటు స్కూళ్ల సమగ్ర సమాచారం ఈ ప్రత్యేక పోర్టల్‌లోనే...

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది.
ఇందుకు సంబంధించి ఇటీవలే ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఇందులో ఆయా స్కూళ్లు తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారం మొత్తాన్ని అందించాలి. పాఠశాలల అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పటికే అమలవుతోంది. అందులో ఆయా స్కూళ్ల భవనాలు, తరగతి గదులు, అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్, మున్సిపల్ తదితర వివిధ విభాగాల అనుమతులు, నిరభ్యంతర ధృవపత్రాలు సమర్పించేలా నిబంధనలు ఉన్నాయి. విద్యార్థులు, వారి ఫీజులు, సదుపాయాలు వంటి నిబంధనలూ ఉన్నాయి. టీచర్లకు సంబంధించి కూడా కొన్ని నియమాలున్నా వాటి అమలు అంతంతే. ఇక విద్యార్థుల ఫీజుల నుంచి టీచర్లకు ఇచ్చే జీతాలు, సదుపాయాల కల్పన ఇలా అన్నీ వాస్తవ విరుద్ధమైన రీతిలోనే ఉంటున్నాయి.

అలాగే..
  • కొన్ని కార్పొరేట్ స్కూళ్లు అయితే అనుమతుల్లేకుండానే నడిపేస్తున్నాయి.
  • కొన్ని ఒక అడ్రసులో అనుమతులు తీసుకుంటూ వేరేచోట ఎక్కడో నిర్వహిస్తున్నాయి.
  • ఆయా టీచర్ల అర్హతలు, వారికిస్తున్న వేతనాలు, ఇతర సదుపాయాల విషయంలో స్కూళ్ల యాజమాన్యాలు ఇస్తున్న సమాచారం వేరు.. వాస్తవంగా వేరుగా ఉంటోంది.
  • ఇవి విద్యాశాఖలోని అధికారులందరికీ తెలుసు. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడంవల్ల ఈ తంతు దశాబ్దాల తరబడి సాగుతోంది.
  • కొన్ని కార్పొరేట్ స్కూళ్లు గత ప్రభుత్వ పెద్దల బినామీవిగా ఉండడం, స్కూళ్ల అధిపతులే మంత్రులు కావడంతో అధికారులు కూడా ఏమీచేయలేని స్థితి.
  • ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాల, ఉన్నత విద్యారంగాలు రెండింటినీ సమూలంగా ప్రక్షాళన చేసి ప్రమాణాలు పెంచే దిశగా అనేక చర్యలు చేపట్టింది.
  • ఇందులో భాగంగా ఇప్పటికే ఈ రెండింటికీ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు చైర్మన్లుగా చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటుచేసింది.
  • అంతేకాక.. పాఠశాల విద్యాశాఖ ఆయా స్కూళ్లలోని పరిస్థితులపై వాస్తవిక, సమగ్ర సమాచారాన్ని సేకరించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా..
  • ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు సంబంధించి ప్రత్యేకంగా ‘ప్రైవేటు టీచర్స్ పర్టిక్యులర్స్’ పేరుతో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన వెబ్‌సైట్లో కొన్ని వివరాలు అప్‌లోడ్ చేయిస్తోంది.
  • ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వినతి మేరకు మే 5వ తేదీ గడువు పొడిగించి ఆ తేదీలోగా అందరూ తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారాన్ని పొందుపర్చాలని ఆదేశించింది. టీచర్లకు సంబంధించి అనేక అంశాలు దీనిలో ఉన్నాయి.

ప్రైవేట్ స్కూళ్లు ఇవ్వాల్సిన వివరాలు ..
  • జిల్లా కోడ్
  • స్కూల్ పేరు
  • జిల్లా పేరు
  • మండలం
  • గ్రామం
  • స్కూల్ కేటగిరి.

టీచర్లు ఇవ్వాల్సిన ప్రాథమిక సమాచారం ..
  • టీచర్ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్, పాన్‌కార్డు నెం, ఆధార్ నెం, మొబైల్ నెం, కమ్యూనిటీ, నెల జీతం, నెలవారీ టాక్స్, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్.
  • ఇక టీచర్ల అర్హతలకు సంబంధించి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ తదితరాలను పొందుపర్చాలి. ఆయా కోర్సులు పాసైన తేదీలు, వాటిని ఏ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, సంస్థల్లో చదివారో కూడా స్పష్టంగా తెలియజేయాలి. వీటితో పాటు టీచర్లు ఎక్కడ నివసిస్తున్నారన్న అంశాలను పొందుపర్చాలి.
Published date : 29 Apr 2020 05:08PM

Photo Stories