Skip to main content

ప్రైవేట్ విద్యా సంస్థలు 70 శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని అదేశించాం..: ఆదిమూలపు సురేష్

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 2వ తేదీ నుంచి(సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాఠశాలలు, కళాశాలలకు వస్తున్నారన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లడుతూ... మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చాలా పాఠశాలలు 'నాడు-నేడు' కార్యక్రమం కింద అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు జగనన్న విద్య కానుక ఇచ్చామని, అన్ని వసతులు వారికి అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కోవిడ్ పట్ల అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలు 70 శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని అదేశించాం. ఇది న్యాయమైన నిర్ణయం. దాదాపు అయిదారు నెలలు స్కూల్స్ నడవలేదు. అలాంటప్పుడు పూర్తి ఫీజు ఎలా వసూలు చేస్తారు?. వాళ్ళకి టీచర్లు, సిబ్బంది జీతాలు ఉంటాయి కాబట్టి అన్ని ఆలోచించి 70 శాతం ఫీజు నిర్ణయించాం. ఏ ఒక్కరూ అంతకు మించి వసూలు చేయవద్దు. అలా చేస్తున్నట్లు పిర్యాదు వస్తే చర్యలు తప్పవు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో నిబంధనల మేరకు వసతులు తప్పనిసరిగా ఉండాలి. ఆయా సంస్థల్లో వసతులపై ఆకస్మిక తనికీలు చేస్తున్నాం అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.
Published date : 02 Nov 2020 07:25PM

Photo Stories