Skip to main content

ప్రాంతీయ భాషల్లో ఆన్‌లైన్ కోర్సులు

సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా యూజీసీ ప్రణాళిక చేపట్టింది. ఆన్‌లైన్ కోర్సులు, డిజిటల్ ఎడ్యుకేషన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా సిద్ధమైంది.

ఇప్పటికే స్వయం, స్వయంప్రభ, వర్చువల్ ల్యాబ్, నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఈ-పీజీ పాఠశాల తదితరాలు అందుబాటులో ఉండగా కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఉపకరించేలా వీటిని పెద్ద ఎత్తున ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు అందించే క్రెడిట్లను వారు చదువుకునే విద్యాసంస్థలు, వర్సిటీలకు బదిలీ చేయనున్నారు. దీనికి సంబంధించి క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఆన్‌లైన్ లెర్నింగ్‌ను ఇప్పటికే రూపొందించింది.

  • యూజీసీ కొన్ని విద్యాసంస్థల ద్వారా మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్స్)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో చేరడం ద్వారా విద్యార్థుల పరిజ్ఞానం పెంపొందుతుందని యూజీసీ భావిస్తోంది. ఆన్‌లైన్ కోర్సుల్లో చేరేలా విద్యార్థులను ప్రోత్సహించాలని వర్సిటీలకు సూచిస్తోంది. అధ్యాపకులు కూడా తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు వీటిని వినియోగించుకోవాలని సూచనలు చేసింది.
  • ఆత్మ నిర్భర్ భారత్ గురించి విద్యార్థులకు మరింత అవగాహన కల్పించాలని యూజీసీ పేర్కొంది.


కులవివక్షకు తావివ్వరాదు..

  • ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అన్ని వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యాసంస్థల అధిపతులను యూజీసీ తాజాగా ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సామాజిక నేపథ్యాన్ని చిన్నబుచ్చే చర్యలకు తావివ్వకుండా అధికారులు, బోధనా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
  • వివక్షపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు ఆయా సంస్థల వెబ్‌సైట్లలో ప్రత్యేక పేజీని రూపొందించాలని, వాటిని రిజిస్ట్రార్, ప్రిన్సిపాళ్లు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.
Published date : 28 Sep 2020 03:19PM

Photo Stories