Skip to main content

పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం ఉన్న నాలుగు గ్రేడ్లను ఏ,బీలుగా కుదింపు

సాక్షి, హైదరాబాద్ : పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కత్తెర పెడుతోంది. ప్రస్తుతం ఉన్న నాలుగు గ్రేడ్‌ల విధానాన్ని సమీక్షిస్తున్న ప్రభుత్వం.. వీటిని రెండింటికే పరిమితం చేయాలని భావిస్తోంది.
ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనకు వెళ్లాయి.గతంలో కొనసాగిన క్లస్టర్ విధానానికి రాష్ట్ర సర్కార్ చరమగీతం పాడిన నేపథ్యంలో గ్రేడ్‌లను కొనసాగించడం అర్థరహితమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జీపీల ఆదాయం ఆధారంగా సగటున రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక క్టస్టర్‌ను ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్‌శాఖ.. రూ.10 లక్షల ఆదాయం ఉన్న క్లస్టర్ గ్రేడ్-1, రూ.7 లక్షల రాబడి ఉన్న క్లస్టర్ గ్రేడ్-2, రూ.5 లక్షల ఆదాయం ఉన్న క్లస్టర్ గ్రేడ్-3, రూ.5 లక్షల రాబడిలోపు క్లస్టర్‌కు గ్రేడ్-4 హోదా కలిగిన కార్యదర్శులను నియమించింది. 2018లో కొత్త పంచాయతీరాజ్ కార్యదర్శి ఉండాలనే నిబంధనను పొందుపరిచింది. 12,751 పంచాయతీల్లో ఖాళీలను భర్తీ చేసేందు కు కొత్తగా 9వేలమందికి పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. దీంతో అప్పటివరకు కొనసాగిన క్లస్టర్ వ్యవస్థకు ఫుల్‌స్టాప్ పడింది. ఈ నేపథ్యంలో పంచాయతీలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చినందున నాలుగు గ్రేడ్లు అనవసరమనే వాదన వచ్చింది. దీంతో పంచాయతీ కార్యదర్శులను ఏ, బీ గ్రేడ్లుగా నిర్వచించి.. 1,3 గ్రేడ్లకు కోత పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఉద్యోగులకు అన్యాయం: కార్యదర్శుల సంఘం
గ్రేడ్ల విధానాన్ని ఎత్తివేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, రమేశ్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. గ్రామ పంచాయతీల జనాభా ఆధారంగా గ్రేడ్‌లను ఏర్పాటు చేసి.. ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని కోరారు.పదోన్నతులు కల్పించకపోవడంతో 600 మంది ఉద్యోగులకు నష్టం వాటిల్లుతోందన్నారు. 200 గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి పోస్టులు ప్రమోషన్లతో ఖాళీ అయినా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 370 మంది గ్రేడ్-2 కార్యదర్శులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
Published date : 01 Feb 2020 04:20PM

Photo Stories