Skip to main content

పాఠశాల విద్యార్థుల కోసం ఔట్‌రీచ్ ప్రోగ్రామ్

సాక్షి, హైదరాబాద్: పౌర సేవలు, ప్రభుత్వ పాలనలో ఆధునిక ఐటీ సాంకేతిక ఆవిష్కరణలను వినియోగించడానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ఆవిష్కరణలకు కూడా ఊత మివ్వాలని భావిస్తోంది.

రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణం పెంపొందించేందుకు ప్రభుత్వ పరంగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ), రీసెర్చ్, ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్), టీ వర్క్స్, టాస్క్, టీ హబ్, వీ హబ్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఆవిష్కరణల వాతావరణం సృష్టించేందుకు రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖతో కలసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆవిష్కరణలు, స్టార్టప్ సంబంధిత అంశాల్లో కృషి చేసే విద్యార్థుల కోసం కోర్సు క్రెడిట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్
విద్యార్థుల్లో ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖతో కలసి టీఎస్‌ఐసీ తెలంగాణ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరిట తాజాగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహి స్తోంది. యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సహకారంతో 6 రోజుల పాటు జరిగే శిక్షణలో రాష్ట్రవ్యాప్తంగా 5,093 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటు న్నారు. తమ చుట్టూ ఉన్న సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలు కనుగొనేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని టీఎస్‌ఐసీ వర్గాలు వెల్లడించాయి.

ఇంటింటా ఇన్నోవేటర్‌తో ప్రోత్సాహం
గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిల్లాల వారీగా ఉత్తమ ఆవిష్కరణలను టీఎస్‌ఐసీ గుర్తిస్తోంది. ఈ ఆవిష్కరణలకు వాణిజ్య రూపాన్ని ఇచ్చేందుకు అవసరమైన సహకారాన్ని టీఎస్‌ఐసీ అందజేస్తుంది. ఇదిలాఉంటే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో టీ హబ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వీ హబ్ ద్వారా శిక్షణ ఇవ్వడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Published date : 28 Sep 2020 03:23PM

Photo Stories