Skip to main content

నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు నేనిచ్చే ఆస్తి చదువే: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: చదువు పునాదులపైనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
చదువుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక కష్టాలను తన సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా చూసి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందచేస్తూ విద్యా దీవెనతో పాటు వసతి దీవెన, విద్యా కానుక, అమ్మ ఒడి లాంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. 2020 – 21 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసిక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జగనన్న విద్యా దీవెన మొదటి విడతను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. 10,88,439 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.671.45 కోట్లను 9,79,445 మంది తల్లుల ఖాతాల్లో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. అనంతరం వివిధ జిల్లాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, కలెక్టర్లనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సీఎం జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..

బాబా సాహెబ్‌ స్ఫూర్తితో..
అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ జగనన్న విద్యా దీవెన పథకాన్ని సొంతం చేసుకున్నాయి. ఇది నిజంగా గొప్ప కార్యక్రమం. ఇందులో పాలు పంచుకోవడం, ఇది నా ద్వారా జరగడం దేవుడిచ్చిన అదృష్టం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతిని ఈ నెల 14న నిర్వహించుకున్నాం. ఒక పేద దళిత కుటుంబంలో, అప్పటి సమాజంలో చదవటానికి అవకాశాలు లేని కుటుంబంలో పుట్టిన బాబా సాహెబ్‌ అన్నిటికీ ఎదురీది ఆనాడు దేశంలో ఎవరూ చదవనన్ని ఉన్నత చదువులు చదివారు. రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారు.

జీవితాన్ని మార్చేసే విద్యా ధనం
పెద్ద చదువన్నది ఇప్పుడు ఒక కనీస అవసరంగా మారిపోయింది. పేదరికం నుంచి బయటపడేందుకు, మెరుగైన ఆలోచనలకు, మంచి ఉద్యోగానికి, ఉపాధికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, సమాజంలో గౌరవం పొందటానికి, ఒక మనిషి తన తరవాత తరాల భవిష్యత్తుకు మెరుగైన బాటలు వేయటానికి పెద్ద చదువన్నది కనీస అవసరంగా మారింది. నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు నేనిస్తున్న ఆస్తి చదువు అని గర్వంగా చెబుతున్నా. 15 సంవత్సరాలకు టెన్త్, 17 ఏళ్లకు ఇంటర్, 20–21 ఏళ్ల మధ్య డిగ్రీ పూర్తి చేసిన ఓ చెల్లెమ్మ, ఓ తమ్ముడు తమకు 60 – 70 ఏళ్లు వచ్చే నాటికి ఆ చదువు పునాది మీదే తన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని ఒక్కసారి బేరీజు వేసుకోగలిగితే.. ఏ అప్పులూ లేకుండా మంచి చదువులు చదివితే, వారి జీవితాలు ఎలా మారతాయన్నది ఊహించగలిగితే చదువు విలువ ఏమిటన్నది అర్ధమవుతుంది.

వారి బాధలు విన్నాను... చూశాను
9,79,445 మంది తల్లులు, 10.88 లక్షల మందికిపైగా పిల్లలకు మేలు చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో చాలా చోట్ల పిల్లలు, తల్లిదండ్రులు తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి కష్టాలు, బాధలు స్వయంగా చూసి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం.

గత సర్కారు బకాయిలూ చెల్లించాం..
ఇవాళ రూ.671 కోట్లకు పైగా మొత్తాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఇస్తున్నాం. ప్రతి త్రైమాసికం ఫీజును ఆ త్రైమాసికం పూర్తి కాగానే ఇవ్వగలగడం గొప్ప విషయం. గత ప్రభుత్వ హయాంలో 2014 – 2019 వరకు రూ.1,880 కోట్లు బకాయిలు పెట్టి పోయారు. అప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇచ్చింది కూడా అరకొరే. రూ.4,208 కోట్లను ఈ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద గత ఏడాది చెల్లించింది. ఆ విధంగా ఎక్కడా బకాయిలు లేకుండా చేశాం.

మరో 77 వేల మందికి అదనంగా మేలు..
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కోవిడ్‌ వల్ల కాలేజీలు గత ఏడాది డిసెంబరులో మొదలు కాగా తొలి త్రైమాసికానికి సంబంధించి ఇవాళ పేమెంట్లు చేస్తున్నాం. గత ఏడాది 10.11 లక్షల పిల్లలకు మేలు చేస్తే ఈసారి ఆ సంఖ్య 10.88 లక్షలకు చేరింది. అంటే మరో 77 వేల మంది పిల్లలకు అదనంగా మేలు జరుగుతోంది. 9,79,445 మంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. వారి ఖాతాల్లో డబ్బులు జమ అయిన వారం రోజుల్లో ఆ మొత్తం కాలేజీలకు చెల్లిస్తారు. ఇలా గతంలో ఎవరూ చేయలేదు. ప్రశ్నించవచ్చు.. 1902కి ఫోన్‌ చేయవచ్చు ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే ప్రభుత్వం ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాలో జమ చేస్తే తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి ఫీజులు కట్టేటప్పుడు లోపాలున్నా, వసతులు లేకపోయినా నిలదీసే అవకాశం ఉంటుంది. అలాగే 1902 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది. కాలేజీలో పరిస్థితి మారేలా చూస్తుంది. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురైనా 1902కి ఫోన్‌ చేయమని కోరుతున్నాం. ఇలా తల్లులకు కాలేజీలను ప్రశ్నించే అవకాశం కలుగుతుంది. కాలేజీలలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది.

మేనమామలా తోడుగా..
మూడేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీలలో చేర్చడం మొదలు ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందచేస్తూ ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలుస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మార్చేసి ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేస్తున్నాం. నాడు – నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నాం. రోజుకొక మెనూతో గోరుముద్ద అమలు చేస్తున్నాం. అలా పిల్లలకు ఒక మేనమామలా తోడుగా నిలుస్తున్నాం.

విద్యా కానుకలో ఇంగ్లీష్‌ మీడియం డిక్షనరీ..
పిల్లలకు స్కూల్‌ బ్యాగ్, పుస్తకాలు, షూస్, బెల్టులు, యూనిఫామ్‌ సమకూర్చడంతో పాటు ఈ ఏడాది నుంచి జగనన్న విద్యాకానుకలో ఇంగ్లిష్‌ మీడియం డిక్షనరీ కూడా ఇస్తున్నాం. విద్యార్థుల హాస్టల్‌ ఖర్చుల కోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. రకరకాల పథకాలతో పిల్లలకు అడుగడుగునా ప్రభుత్వం తోడుగా నిలుస్తోంది.

‘గత సర్కారు ఏనాడూ ఈ స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. అరకొరగా మాత్రమే విదిల్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తి ఫీజు చెల్లిస్తూ విద్యార్థులకు ఎంతో అండగా నిలుస్తోంది’. ‘‘నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు నేను ఇస్తున్న ఆస్తి చదువేనని గర్వంగా చెబుతున్నా. పిల్లలు చదువుకునేందుకు ఇబ్బంది పడకూడదని, తల్లిదండ్రులు అప్పుల పాలు కారాదనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. జగనన్న విద్యా దీవెన పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం. ఇది నా ద్వారా జరగడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా’’

‘‘చదువుతోనే పేదరికం నుంచి బయటపడతాం. చదువుతోనే జీవితాల రూపురేఖలు మారతాయి. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జీవితం మనందరికీ ఆదర్శప్రాయం’’
– సీఎం వైఎస్‌ జగన్‌

ఎక్కడా అదనంగా వసూలు చేయకూడదు
ఎక్కడ కూడా కాలేజీలు స్పెషల్‌ ఫీజుల పేరుతో కానీ మరే పేరుతో కానీ అదనంగా ఫీజులు వసూలు చేయకుండా అధికారులు చూడాలి. ప్రభుత్వం కచ్చితంగా విద్యార్థుల పూర్తి ఫీజు చెల్లిస్తుంది.
– ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి

మీ పాలన.. అందరికీ ఆదర్శం
‘నేను ఒక అనాథను. నాకు ఒక కేర్‌ టేకర్‌ ఉన్నారు. ఇప్పుడు జగన్‌ మామ య్య ఇంకో కేర్‌ టేకర్‌. విద్యార్ధులకు మీరు చేస్తున్నంత మేలు గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. మీ కృషి వల్ల నాలాంటి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, నాడు– నేడు, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారు. మీ పాలన ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది’
– సి.కెరన్‌, డిగ్రీ విద్యార్థిని, మచిలీపట్నం
Published date : 20 Apr 2021 04:53PM

Photo Stories