మూడేళ్ల ప్రతిభ ఆధారంగా సీబీఎస్‌ఈ అసెస్‌మెంట్ స్కీమ్‌కు సుప్రీం ఓకే!
దేశంలో 12వ తరగతి బోర్డు పరీక్షల రద్దు నిర్ణయంపై ఇక పునరాలోచన లేదని న్యాయస్థానం తేలి్చచెప్పింది. 10, 11, 12వ తరగతుల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు తుది మార్కులు కేటాయించేందుకు 30:30:40 ఫార్ములాను సీబీఎస్‌ఈ తెరపైకి తీసుకొచ్చింది. తుది ఫలితాలను ప్రకటించే విషయంలో గత ఆరేళ్లలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటామని సీఐఎస్‌సీఈ వెల్లడించింది. జూలై 31వ తేదీలోగా ఫలితాలను ప్రకటిస్తామని రెండు బోర్డులు తెలియజేశాయి. అసెస్‌మెంట్ స్కీమ్ పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహించే పరీక్షలకు హాజరు కావొచ్చని సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ సూచించాయి. విద్యార్థులు 10, 11, 12వ తరగతుల్లో సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి, 30:30:40 ఫార్ములా ప్రకారం తుది ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ పేర్కొంది. 10వ తరగతి మార్కులకు 30 శాతం, 11వ తరగతి మార్కులకు 30 శాతం, 12వ తరగతిలో యూనిట్ టెస్టు, మిడ్–టర్మ్, ప్రి–బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుందని తెలిపింది. 12వ తరగతిలో ప్రాక్టికల్, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను సంబంధిత పాఠశాలలు సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, తుది ఫలితాలను ప్రకటించే విషయంలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. పదో తరగతిలో ప్రధాన ఐదు సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్టులను మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకుంటారు.
విద్యార్థులపై వివక్ష చూపే ప్రశ్నే లేదు
12వ తరగతి బోర్డు పరీక్షల రద్దును సవాలు చేస్తూ సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. పిటిషన్‌ను తిరస్కరించింది. పరీక్షల రద్దు నిర్ణయంపై పునరాలోచన ప్రసక్తే లేదని ఉద్ఘాటించింది. ‘‘పరీక్షల విషయంలో సీఐఎస్‌సీఈ, సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఆమోదించాం. పరీక్షలు రాయాలని, మార్కులు మెరుగుపర్చుకోవాలని కోరుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు పరీక్షలు రాసుకోవచ్చు. పరీక్షలకు హాజరు కావాలని ఆశించే వారిపై వివక్ష చూపే ప్రశ్నే లేదు’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఎస్‌ఈ ప్రతిపాదించిన అసెస్‌మెంట్ స్కీమ్‌ను స్వీకరించేందుకు తమకు అభ్యంతరాలు లేవని వెల్లడించింది. దీనిపై బోర్డు ముందుకెళ్లవచ్చని సూచించింది. అసెస్‌మెంట్ స్కీమ్‌ను ఖరారు చేసి, నోటిఫై చేసుకోవడానికి సీఐఎస్‌సీఈ, సీబీఎస్‌ఈకి స్వేచ్ఛ ఉందని వివరించింది. ఇంకా ఏవైనా ప్రతిపాదనలు చేస్తే పరిశీలిస్తామని తెలియజేసింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. సీబీఎస్‌ఈ తరపున అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ వాదనలు వినిపించారు.
వివాదాల పరిష్కారానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి
అసెస్‌మెంట్ స్కీమ్‌పై ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఐఎస్‌సీఈ, సీబీఎస్‌ఈకి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. వివాదాల పరిష్కారంపై ప్రొవిజన్స్‌ను ఈ స్కీమ్‌లో చేర్చాలని స్పష్టం చేసింది. తుది మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు కోర్టు తలుపులు తట్టే అవకాశం ఉందని గుర్తుచేసింది.
సీబీఎస్‌ఈ చరిత్రలో ఇదే తొలిసారి
‘‘సీబీఎస్‌ఈ 1929 నుంచి మనుగడలో ఉంది. పరీక్షలను వాయిదా వేసే పరిస్థితి సీబీఎస్‌ఈ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. ఈసారి మాత్రం తప్పడం లేదు. అసెస్‌మెంట్ స్కీమ్‌ను నిపుణుల కమిటీ రూపొందించింది. తుది ఫలితాల విషయంలో 10, 11, 12వ తరగతుల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. 10వ తరగతిలో ప్రధానమైన ఐదు సబ్జెక్టులు ఉండగా, విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించిన మూడు సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకుంటాం. ఈ మూడు సబ్జెక్టుల్లో పొందిన మార్కులకు 30% వెయిటేజీ లభిస్తుంది. 11వ తరగతిలో థియరీ పేపర్‌లో సాధించిన మార్కులకు 30% వెయిటేజీ ఉంటుంది. ఇక 12వ తరగతిలో యూనిట్ టెస్టు, మిడ్–టర్మ్, ప్రి–బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు మరో 40% వెయిటేజీ ఉంటుంది. ఈ మూడు రకాల వెయిటేజీల ఆధారంగా తుది ఫలితాలను ప్రకటిస్తాం’’అని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు.