మేము చదవటాన్ని ఇష్టపడతాం.. !
Sakshi Education
సాక్షి, అమరావతి బ్యూరో: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ‘మేము చదవటాన్ని ఇష్టపడతాం..’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టనుంది.
సాంకేతిక విప్లవం నేపథ్యంలో చాలా మంది విద్యార్థుల్లో పఠనాసక్తి తగ్గుతున్నట్లు పలు నివేదికల ద్వారా వెల్లడైంది. దీంతో పాఠశాల దశలోనే విద్యార్థులకు పుస్తకాల గొప్పదనం తెలియజేసి.. వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లోని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రధానోపాధ్యాయులు మొదలుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారు చదివిన పుస్తకాలను ఇతరులు చదివేందుకు వీలుగా పాఠశాలకు వితరణ ఇచ్చే అవకాశం కల్పించారు. దాతల సాయంతో గ్రంథాలయాల్లో మరిన్ని పుస్తకాలను చేర్చి.. వాటి సామర్థ్యం పెంచనున్నారు. తరగతుల వారీగా విద్యార్థులకు తగిన పుస్తకాలను ఎంపిక చేసి చదివిస్తారు. మూడో పిరియడ్ తెలుగు మీడియం, ఆరో పిరియడ్‌లో ఇంగ్లిష్ మీడియంలోని పుస్తకాలను విద్యార్థులతో చదివించాల్సి ఉంటుంది. కాగా, ‘మేము చదవటాన్ని ఇష్టపడతాం’ ప్రారంభోత్సవ కార్యక్రమం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరగనుంది. దీనికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోం మంత్రి మేకతోటి సుచరిత, ప్రజాప్రతినిధులు, విద్యా శాఖ అధికారులు హాజరవుతారు. అలాగే పార్లమెంట్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా అన్ని పాఠశాలల్లో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. విద్యార్థులకు రాజ్యాంగం గొప్పదనం తెలియజేయడంతో పాటు.. అప్పట్లో జరిగిన పరిణామాలు, ముఖ్యమైన వ్యక్తుల పాత్రను టీచర్లు వివరిస్తారు. దీన్ని కూడా మంత్రులు గురువారం ప్రారంభిస్తారు.
Published date : 26 Nov 2020 01:32PM