మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు...ఫలితాలు ఎప్పుడంటే..?
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పరీక్షలు మే 4 నుంచి నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల ప్రారంభ తేదీలను డిసెంబర్ 31వ తేదీన ప్రకటించారు. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు 2021 మే 4 నుంచి 2021 జూన్ 10 వరకు జరుగుతాయని, పరీక్షల ఫలితాలు 2021 జూలై 15 నాటికి ప్రకటిస్తామని పోఖ్రియాల్ తెలిపారు. 12 వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి జరుగుతాయని ఆయన వివరించారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు ఇంతకు ముందెన్నడూ లేని అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, అయితే విద్యార్థులు తమ చదువులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేశారని పోఖ్రియాల్ ప్రశంసించారు. ఉపాధ్యాయులు కష్టపడి పనిచేసినందుకు, కొత్త పద్ధతులు, నూతన బోధనా పద్ధతులను అవలంబించినందుకు ఆయన ప్రశంసించారు. డిజిటల్ మాధ్యమం ద్వారా నేర్చుకోవడానికి ఒక వేదిక, కంటెంట్ అందించడానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుందని ఆయన గుర్తుచేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాత తేదీలపై నిర్ణయం తీసుకున్నామని పోఖ్రియాల్ తెలిపారు.
Published date : 01 Jan 2021 04:36PM